అందుకే కోహ్లిని ప్రతిసారి ‘సెల్ఫిష్‌’ అంటున్నావా?: పాక్‌ మాజీ కెప్టెన్‌కు కౌంటర్‌

9 Nov, 2023 14:49 IST|Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి విషయంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ హఫీజ్‌కు ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు. కోహ్లి బౌలింగ్‌లో హఫీజ్‌ అవుట్‌ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ అతడిని ట్రోల్‌ చేశాడు. కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లో విరాట్‌ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో నాలుగు అర్ధ శతకాలు సహా రెండు సెంచరీలు సాధించి జోష్‌లో ఉన్నాడు. చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శతకం ద్వారా వన్డేల్లో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న సెంచరీల రికార్డు(49)ను సమం చేసి చరిత్ర సృష్టించాడు. 

ఈ నేపథ్యంలో రన్‌మెషీన్‌ కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తుండగా... పాక్‌ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘కోల్‌కతాలో విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్నపుడు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాడని నాకు అనిపించింది.

ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికిది మూడోసారి. సింగిల్‌తో అతడు 49వ వన్డే శతకాన్ని అందుకున్న తీరు చూస్తే.. జట్టుకోసం కాకుండా కేవలం తన సెంచరీ కోసం మాత్రమే ఆడినట్లు అనిపించింది’’ అని హఫీజ్‌ వ్యాఖ్యానించాడు.

ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులతో పాటు వెంకటేశ్‌ ప్రసాద్‌, మైకేల్‌ వాన్‌ వంటి మాజీ క్రికెటర్ల నుంచి హఫీజ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మరోసారి పరోక్షంగా కోహ్లి పేరును ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశాడు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను ప్రశంసించే క్రమంలో మరోసారి ‘సెల్ఫిష్‌’ కామెంట్స్‌ చేశాడు.

A post shared by ICC (@icc)

ప్రపంచకప్‌-2023లో నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో స్టోక్స్‌ సెంచరీని ప్రశంసిస్తూ.. ‘‘జట్టును గట్టెక్కించే రక్షకుడు. తీవ్ర ఒత్తిడిలోనూ దూకుడైన ఆట తీరుతో కావాల్సినన్ని పరుగులు రాబట్టి చివరికి జట్టును గెలిపించాడు.

స్వార్థపూరిత, స్వార్థ రహిత ఇన్నింగ్స్‌కు తేడా ఇదే’’ అంటూ హఫీజ్‌.. మైకేల్‌ వాన్‌ను ట్యాగ్‌ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘స్టోక్సీ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడనడంలో ఎలాంటి సందేహం లేదు హఫీజ్‌.. 

అయితే, కోల్‌కతా వంటి కఠినతర పిచ్‌పై విరాట్‌ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్‌ చేశాడు. విరాట్‌ కోహ్లి నిన్ను బౌల్డ్‌ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రతిసారి అతడి పేరును ఇలా ప్రస్తావిస్తున్నావేమో అనిపిస్తోంది’’ అని మైకేల్‌ వాన్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. కాగా 2012లో ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి(రైటార్మ్‌ పేసర్‌) హఫీజ్‌ను బౌల్డ్‌ చేశాడు.

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు