జకోవిచ్‌, హలెప్‌ శుభారంభం

1 Jul, 2019 22:20 IST|Sakshi

వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీ

లండన్‌: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్‌ మాజీ నెం.1 సిమోనా హలెప్‌(రొమేనియా) శుభారంభం చేసింది. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో వరల్డ్‌ నెం.7 హలెప్‌ 6–4, 7–5తో సాస్నోవిచ్‌(బల్గేరియా)పై గెలుపొందింది. తొలి సెట్‌ను అలవోకగా గెల్చుకున్న హలెప్‌కు రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో మూడోసీడ్‌ కరోలినా ప్లిస్కోవా(చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 7–6(7/4)తో జు లాంగ్‌(చైనా)పై, మాడిసన్‌ కీస్‌(అమెరికా) 6–3, 6–2తో ఖుమ్‌ఖుమ్‌(థాయ్‌లాండ్‌)పై, స్వితోలినా (ఉక్రెయిన్‌) 7–5, 6–0తో గవ్రిలోవా (ఆస్ట్రేలియా)పై గెలిచారు.

జకోవిచ్‌ అలవోకగా..
పురుషుల విభాగంలో వరల్డ్‌ నెం.1 నొవాక్‌ జకోవిచ్‌ 6–3, 7–5, 6–3తో కొష్లిషెరిబర్‌ (జర్మనీ)పై అలవోకగా నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. జకోవిచ్‌కు ధాటికి రెండో సెట్లో మినహా ప్రత్యర్థి పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) 6–3, 6–4, 6–2తో హెర్బర్ట్‌ (ఫ్రాన్స్‌)పై, స్టాన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6–3, 6–2, 6–2తో బెమెల్మెనాస్‌ (బెల్జియం)పై గెలుపొందారు.

మరిన్ని వార్తలు