జొకోవిచ్‌ రికార్డు విజయం

21 Nov, 2023 03:52 IST|Sakshi

టురిన్‌ (ఇటలీ): అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా 36 ఏళ్ల జొకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు.

ఇటలీ ప్లేయర్‌ యానిక్‌ సినెర్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌ 6–3, 6–3తో నెగ్గి ఈ టోర్నీని రికార్డుస్థాయిలో ఏడోసారి సొంతం చేసుకున్న తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. గతంలో రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) ఆరుసార్లు ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు విన్నర్స్‌ ట్రోఫీతోపాటు 44,11,500 డాలర్ల (రూ. 36 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

జొకోవిచ్‌ 2008, 2012, 2013, 2014, 2015, 2022లలో కూడా ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో చాంపియన్‌ గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఏడా ది జొకోవిచ్‌ ఏడు టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. అడిలైడ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జొకోవిచ్‌ ఆ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నీ, యూఎస్‌ ఓపెన్, పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నీ, ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్‌ సాధించాడు. కెరీర్‌లో 98వ సింగిల్స్‌ టైటిల్‌తో జొకోవిచ్‌ టెన్నిస్‌ చరిత్రలో 400 వారాలు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

మరిన్ని వార్తలు