‘థౌజండ్‌వాలా’  ఆట  మానేశాడు! 

29 Dec, 2017 00:58 IST|Sakshi

న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల క్రితం...భారత క్రికెట్‌లో ప్రణవ్‌ ధనవాడే అనే 16 ఏళ్ల కుర్రాడి పేరు మారుమోగిపోయింది. స్కూల్‌ క్రికెట్‌లో ఏకంగా 1009 పరుగులు సాధించి అతను కొత్త రికార్డులతో సంచలనం సృష్టించాడు. అభినందనలు, సత్కారాలకు లెక్కే లేదు... సచిన్‌ టెండూల్కర్‌ స్వయంగా తన సంతకంతో బ్యాట్‌ను పంపించి ప్రత్యేకంగా అభినందించాడు. అతనికి అండగా మేమంతా అంటూ ఎవరెవరో వచ్చి ప్రణవ్‌ను ఆకాశానికెత్తేశారు. కానీ ఇదంతా ఓ వైపు... ఆ తర్వాత అదే ‘థౌజండ్‌’ స్కోరు ప్రణవ్‌కు పెనుభారంగా మారింది. అపరిమిత అంచనాలో లేక ఆటలో పదును తగ్గిందో కానీ ఆ వేయి పరుగుల ఇన్నింగ్స్‌ తర్వాత అతని బ్యాట్‌ మూగబోయింది. సాధారణ స్థాయి స్కోర్లు కూడా చేయలేక అతను చతికిలపడ్డాడు. ఎంత ప్రయత్నించినా నాటి ఇన్నింగ్స్‌లో పదో వంతు ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. దాని ఫలితం...ప్రణవ్‌ ఇప్పుడు ఆటనుంచే తప్పుకునేందుకు సిద్ధమైపోయాడు.

మానసికంగా కుంగిపోయిన అతను క్రికెట్‌ ఆడటం తనవల్ల కాదంటూ బ్యాట్‌ విడిచిపెట్టాడు. బలమైన కుటుంబ ఆర్థిక నేపథ్యం లేకపోవడం వల్లనో, కష్టాల్లో వెన్నుదన్నుగా నిలిచేవారు లేకనో ప్రణవ్‌కు సరైన మార్గనిర్దేశనం చేసేవారే కరువయ్యారు. దాంతో అతను వరుస వైఫల్యాల తర్వాత క్రికెట్‌ ఆడటమే మానేశాడు!  ఏడాదిన్నరగా క్రికెట్‌లో విఫలమవుతుండటంతో మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) నుంచి వచ్చే రూ. 10,000 ఉపకార వేతనాన్ని నిలిపివేయాల్సిందిగా స్వయంగా అతని తండ్రి ప్రశాంత్‌ ధనవాడే కోరాడు. తిరిగి ప్రణవ్‌ ఫామ్‌ అందుకొని క్రికెట్‌లో రాణించినప్పుడు అతన్ని ఆదుకోవాల్సిందిగా ఎంసీఏకు విన్నవించాడు. అసలే ఫామ్‌ కోల్పోయి మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్న ప్రణవ్‌ను ఎయిరిండియా, దాదర్‌ యూనియన్‌ క్లబ్‌లు తమ అకాడమీల్లో ప్రాక్టీస్‌ చేసేందుకు కూడా అనుమతించలేదు. బెంగళూరులో అండర్‌–19 జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పిన మాటలు కూడా ప్రణవ్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపలేకపోయాయి. ఈ అంశంపై ప్రణవ్‌ కోచ్‌ మోబిన్‌ షేక్‌ మీడియాను తప్పుబట్టారు. అతి ప్రచారం కూడా ప్రణవ్‌ ఏకాగ్రతను దెబ్బతీసిందన్నారు. చిన్న గ్రౌండ్‌లలో ఆడటంతోనే పరుగులు సాధించాడు అంటూ అప్పుడు వచ్చిన తప్పుడు కథనాలు ప్రణవ్‌ ఆటతీరును దెబ్బతీశాయని అతను వివరించాడు. అతడు తప్పకుండా తిరిగి బ్యాట్‌ అందుకుంటాడని, గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. కోచ్‌తో పాటు కొందరు సన్నిహితులు అతనిలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారి కృషి సఫలం కావాలని కోరుకుందాం!    

మరిన్ని వార్తలు