బంగ్లాదేశ్‌ ఎంత వరకు?

24 May, 2019 00:43 IST|Sakshi

రికార్డు మెరుగుపర్చుకోవడంపై గురి

ఇటీవలి ఫామ్‌ సానుకూలాంశం  

గత ప్రపంచ కప్‌లో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గుర్తుందా? రోహిత్‌ శర్మ ఔటైన బంతిని నోబాల్‌గా తప్పుగా ప్రకటించారని, దాని వల్లే తాము మ్యాచ్‌ ఓడామని ఆ దేశ క్రికెటర్లు, అభిమానులు చిందులేశారు. భారత్‌లాంటి టీమ్‌పై ఒక్క గెలుపు కోసం వారంతా నానా యాగీ చేశారు. ఆ మ్యాచ్‌ వారిని చాలా కాలం వెంటాడింది. అయితే ఆ ప్రపంచ కప్‌ తర్వాత నాలుగేళ్లలో బంగ్లాదేశ్‌ జట్టు అన్ని విధాలుగా చాలా మారింది. పెద్ద జట్లపై వరుస  విజయాలు సాధించలేకపోతున్నా... గతంలోలాగా ఏదో ఒక సంచలనంతో సరి  పెట్టి సంతోషపడే టీమ్‌ మాత్రం ఇప్పుడు కాదిది.  2018లో వన్డేల్లో విజయాలు, పరాజయాల నిష్పత్తి చూస్తే భారత్‌ తర్వాత అత్యంత విజయవంతమైన టీమ్‌ బంగ్లాదేశ్‌. అంతకు ముందు ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీలో సెమీఫైనల్‌ వరకు చేరిన ఈ జట్టు అనంతరం ఆసియా కప్‌లో ఫైనల్‌కు వెళ్లి త్రుటిలో చివరి బంతికి  విజయాన్ని కోల్పోయింది. అనుభవజ్ఞులు, సీనియర్లతో సమతూకంగా ఉన్న బంగ్లాను ఇప్పటికీ ఎవరైనా ‘బేబీ’లుగా వ్యవహరిస్తే గట్టి షాక్‌ 
తప్పదు.  

బలాలు
బంగ్లాదేశ్‌ వరల్డ్‌ కప్‌ చరిత్ర చూస్తే ఈసారి ఎంపిక చేసిన జట్టే బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇదే ఇంగ్లండ్‌లో 2017 చాంపియన్స్‌ ట్రోఫీలో సెమీస్‌ చేరిన టీమ్‌లో ఆ జట్టు ఎక్కువగా మార్పులు చేయలేదు. వారిపైనే నమ్మకముంచి కొనసాగించడంతో ఫలితాలు దక్కాయి. కెప్టెన్‌ మొర్తజా, తమీమ్, షకీబ్, ముష్ఫికర్, మహ్ముదుల్లా జట్టుకు మూల స్థంభాలు. తమీమ్‌ ఓపెనర్‌గా అద్భుత ఆరంభం ఇవ్వగలడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచిన షకీబ్‌ జట్టుకు అత్యంత కీలకం. ముష్ఫికర్‌ ఆట కూడా ఎంతో మెరుగవగా... ఈ టోర్నీ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్న మొర్తజా టోర్నీని చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు.

బౌలింగ్‌లో యువ ముస్తఫిజుర్‌ అతి పెద్ద బలం. ఇక్కడి వాతావరణంలో అతని స్వింగ్, కటర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టగలవు. పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందే వచ్చి ముక్కోణపు టోర్నీలో ఆడిన బంగ్లాదేశ్‌ తమ వన్డే చరిత్రలో తొలి సారి ఒక టోర్నీని కూడా గెలుచుకోవడం విశేషం. ఇది జట్టు తాజా ఫామ్‌ను చూపిస్తోంది. ఈ టోర్నీతో మొసద్దిక్‌ హుస్సేన్‌ ఫామ్‌లోకి రావడం జట్టుకు సానుకూలాంశం. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మెహదీ హసన్‌ ప్రభావం చూపించగలడు.

బలహీనతలు 
ఆటపరంగా ఎంత మెరుగ్గా ఉన్నా, కొన్ని అద్భుత వ్యక్తిగత ప్రదర్శనలు ఉన్నా... బంగ్లాదేశ్‌ను ఎవరూ వరల్డ్‌ కప్‌ ఫేవరెట్‌గా పరిగణించరు. వరుసగా పెద్ద జట్లపై విజయాలు సాధించిన రికార్డు లేకపోవడమే అందుకు కారణం. మెగా టోర్నీలో ఎన్నో ఆశలతో బరిలోకి దిగడం, ఆ తర్వాత కీలక మ్యాచ్‌లో ఒత్తిడిలో చిత్తు కావడం ఆ జట్టుకున్న అవలక్షణం. అత్యుత్తమ ఆటగాళ్లు, అనుభవం ఉన్నా సరే... అవసరమైన స్థితిలో దానిని ప్రదర్శించడంలో జట్టు విఫలమవుతోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా జట్టు రికార్డు పేలవంగా ఉండటమే అందుకు ఉదాహరణ.

ముఖ్యంగా కీలక సమయాల్లో ప్రధాన ఆటగాళ్లు తరచుగా విఫలమయ్యారు. తమీమ్, ముష్ఫికర్‌లలో నిలకడ లేకపోగా... రూబెల్‌ బౌలింగ్‌ను నమ్మలేం. కెరీర్‌ చివర్లో మొర్తజా బౌలింగ్‌లో పదును కనిపించడం లేదు. సరిగ్గా చెప్పాలంటే షకీబ్, ముస్తఫిజుర్‌ మినహా మరే బౌలర్‌ను నమ్మలేని పరిస్థితి. వీరిద్దరు రాణించినా మిగతావారు చేతులెత్తేస్తే మ్యాచ్‌ చేజారటం ఖాయం. సుదీర్ఘ కాలం సాగే తాజా ఫార్మాట్‌లో సర్కార్, లిటన్‌ దాస్‌ నిలకడగా రాణించకపోతే కష్టం.  

గత రికార్డు: 1999 నుంచి బంగ్లాదేశ్‌ ప్రతీ ప్రపంచ కప్‌లో ఆడింది. 2015లో ఇంగ్లండ్‌పై విజయంతో క్వార్టర్‌ ఫైనల్‌ (నాకౌట్‌ దశ)కు చేరడం మినహా ప్రతీ సారి గ్రూప్‌ దశకే పరిమితమైంది. 2007లో భారత్‌పై సాధించిన సంచలన విజయంతో తర్వాతి రౌండ్‌ సూపర్‌ ఎయిట్స్‌కు అర్హత సాధించగలిగింది. ఈసారి మెరుగైన ర్యాంకింగ్‌తో వెస్టిండీస్‌ను వెనక్కి తోసి నేరుగా టోర్నీకి అర్హత పొందింది. ఓవరాల్‌గా 33 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో 11 గెలిచి 20 ఓడింది. మరో 2 రద్దయ్యాయి.

జట్టు వివరాలు
మష్రఫె మొర్తజా (కెప్టెన్‌), అబూ జాయెద్, లిటన్‌ దాస్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, మొహమ్మద్‌ మిథున్, సైఫుద్దీన్, మొసద్దిక్‌ హుస్సేన్, ముష్ఫికర్‌ రహీమ్, ముస్తఫిజుర్‌ రహమాన్, రూబెల్‌ హుస్సేన్, షబ్బీర్‌ రహమాన్, షకీబ్‌ అల్‌ హసన్, సౌమ్య సర్కార్, తమీమ్‌ ఇక్బాల్‌.    

>
మరిన్ని వార్తలు