మరోసారి పాక్‌ పనిపట్టిన భారత్‌

17 Jun, 2019 00:07 IST|Sakshi

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడోసారి ఓడించి ప్రపంచకప్‌లో పాక్‌పై విజయ పరంపరను భారత్‌ కొనసాగించింది. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల(డక్‌వర్త్‌ లూయిస్‌)తేడాతో కోహ్లి సేన ఘన విజయం సాధించింది. టీమిండియా విజయాన్ని పాక్‌ కంటే ఎక్కువగా వరణుడే అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ వర్షం పలుమార్లు అడ్డంకిగా నిలిచింది. సెంచరీతో కదంతొక్కి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన హిట్‌ మ్యాన్‌ రోహిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది

టీమిండియా నిర్దేశించిన 337 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఇమామ్‌(7) వికెట్‌ను త్వరగానే చేజార్చుకుంది. అయితే మరో ఓపెనర్‌ ఫఖర్‌ బాబర్‌ అజమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. వీరు రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిన కుల్దీప్‌ విడదీస్తాడు. వెంటవెంట ఓవర్లలో బాబర్‌(48), ఫఖర్‌(62)లను కుల్దీప్‌ ఔట్‌ చేసి మ్యాచ్‌ను టర్న్‌ చేస్తాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్‌ హఫీజ్‌(9), మాలిక్‌(0)లను హార్దిక్‌ వెనక్కి పంపిస్తాడు. దీంతో విజయం భారత్‌ వైపు తిరిగింది. ఈ తరుణంలో పాక్‌ ఆదుకుంటాడనుకున్న సర్ఫరాజ్‌(12)ను శంకర్‌ బోల్తాకొట్టిస్తాడు. 

అయితే 35 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించడంతో కాసేపు ఆట నిలిచిపోయింది. ఆట ఆగే సమయానికి పాక్‌ స్కోరు 166/6. వర్షం తగ్గాక మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించి పాక్‌ లక్ష్యాన్ని 302 పరుగులుగా నిర్ణయించారు. అయితే అసాధ్యమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ నిర్ణీత 40 ఓవర్లలో(డీఎల్‌) 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో కుల్దీప్‌, విజయ్‌, హార్దిక్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌ శర్మ(140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సెంచరీకి తోడు కేఎల్‌ రాహుల్‌(57; 78 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి(77; 65 బంతుల్లో 7 ఫోర్లు)లు హాఫ్‌ సెంచరీలతో మెరవడంతో పాకిస్తాన్‌కు 337 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పాకిస్తాన్‌ బౌలర్లలో మహ్మద్‌ అమిర్‌ మూడు వికెట్లు సాధించగా, హసన్‌ అలీ, వహాబ్‌ రియాజ్‌లు చెరో వికెట్‌ తీశారు.
 

మరిన్ని వార్తలు