‘కోహ్లి అంటే పాక్‌లో పిచ్చి అభిమానం’

3 Jun, 2019 20:23 IST|Sakshi

లండన్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అంటేనే రికార్డుల రారాజు. ఇప్పటికే ఎన్నో రికార్డుల, అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే దాయాది పాకిస్తాన్‌లో కోహ్లి అంటే పడి చచ్చిపోతారని ఆ జట్టు మాజీ సారథి యునిస్‌ ఖాన్‌ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లో నిర్వహించిన సలాం క్రికెట్‌ 2019లో పాల్గొన్న యునిస్‌ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
‘పాక్‌ ప్రజలు విరాట్‌ కోహ్లి అంటే అమితంగా ప్రేమిస్తారు. మా దేశంలోని ప్రస్తుత యువత అతడిలా బ్యాటింగ్‌ చేయాలని, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా పరుగుల యంత్రం ఆడకపోవడం పట్ల మా దేశ క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. కోహ్లి ఆసియా కప్‌లో పాల్గొని ఉంటే స్టేడియం దద్దరిల్లి పోయేది. ప్రపంచకప్‌లో టీమిండియాకు కోహ్లినే కీలకం. అతడి రాణింపుపైనే ఆ జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి’అంటూ పాక్‌ మాజీ సారథి యునిస్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. 

భారత బ్యాట్స్‌మెన్‌ అంటే నాకు ఇష్టం
ఇకే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు వివి రిచర్డ్స్‌ టీమిండియా ఆటగాళ్లను కొనియాడాడు. ‘నాకు భారత బ్యాట్స్‌మెన్‌ అంటే చాలా ఇష్టం. వారిలో ఎలాంటి గర్వం, పొగరు ఉండదు. వారిలో ఆటపై ఇష్టం, శ్రధ్ద మాత్రమే కనిపిస్తుంది. ఇక విరాట్‌ కోహ్లిలో గెలవాలనే కసి నాకు బాగా నచ్చింది. ఏ ఆటగాడయినా గెలవాలనే కోరుకుంటాడు. కానీ కోహ్లిలో ఆ గుణం కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలలో గెలవాలనే పట్టుదల ఇంకా ఎక్కువగా ఉండాలి. కోహ్లినే టీమిండియా బలం’అంటూ రిచర్డ్స్‌ వ్యాఖ్యానించాడు. 
 

మరిన్ని వార్తలు