సాహా...వహ్వా! 

25 Mar, 2018 02:02 IST|Sakshi

1,4,4,6,4,6,6,4,6,6,1,6,6,6,6,6,6,6,6,6...

20 బంతుల్లో 102 నాటౌట్‌ (14 సిక్స్‌లు, 4 ఫోర్లు)

కోల్‌కతా: భారత క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహా స్థానిక లీగ్‌ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు జేసీ ముఖర్జీ ట్రోఫీలో భాగంగా టి20 ఇంటర్‌ క్లబ్‌ మ్యాచ్‌లో సాహా 20 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మోహన్‌ బగాన్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన సాహా... బెంగాల్‌ నాగ్‌పూర్‌ రైల్వేస్‌ (బీఎన్‌ఆర్‌) జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని 20 బంతుల ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 4 ఫోర్లు, 2 సింగిల్స్‌ ఉన్నాయి. తాను ఆడిన చివరి ఓవర్లో 6 బంతుల్లో సాహా ఆరు సిక్సర్లు బాదడం విశేషం.

ఈ మ్యాచ్‌కు అధికారికంగా గుర్తింపు లేకపోయినా... బెంగాల్‌ క్రికెట్‌లో బీఎన్‌ఆర్‌ పటిష్టమైన జట్టు కావడం, వేదికైన కాళీఘాట్‌ మైదానం కూడా పెద్దది కావడాన్ని బట్టి చూస్తే సాహా ఇన్నింగ్స్‌ను ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన బీఎన్‌ఆర్‌ 151 పరుగులు చేయగా మోహన్‌ బగాన్‌ 7 ఓవర్లలోనే 152 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ శుభోమయ్‌ దాస్‌ 22 బంతుల్లో 43 పరుగులు చేయడంతో 10 వికెట్లతో విజయం సాధించింది. టెస్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు ఉన్న సాహాకు 2014 ఐపీఎల్‌ ఫైనల్లో మెరుపు సెంచరీ సాధించిన రికార్డు ఉంది. ఈసారి అతను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగుతున్నాడు.    

మరిన్ని వార్తలు