CWC 2023: అదంతా చూస్తూ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు.. గొప్ప ఇన్నింగ్స్‌: గంగూలీ

11 Nov, 2023 11:27 IST|Sakshi

ICC WC 2023: వన్డే ప్రపంచకప​-2023లో అఫ్గనిస్తాన్‌ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు కూడా సాధ్యం కాని రీతిలో సెమీస్‌ రేసులో నిలిచి మేటి జట్లకు సవాల్‌ విసిరింది. 

స్పిన్‌ మాత్రమే అఫ్గన్‌ బలం అనుకున్న వాళ్లకు బ్యాటింగ్‌లోనూ తాము తక్కువేం కాదంటూ యువ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్‌, కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది నిరూపించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జద్రాన్‌ అఫ్గన్‌ తరఫున వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు.

లీగ్‌ దశలో ఆడిన మొత్తం తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగింట జట్టును గెలిపించి హష్మతుల్లా సైతం సారథిగా తన ముద్ర వేయగలిగాడు. అయితే, అఫ్గన్‌ విజయాల వెనుక టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా పాత్ర కీలకం అన్న విషయం తెలిసిందే. మెంటార్‌గా జట్టుకు మార్గదర్శనం చేసి ఈస్థాయిలో నిలిపిన ఘనత అతడి దక్కుతుంది. 

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌-2023లో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలను మట్టికరిపించిన అఫ్గనిస్తాన్‌.. ఐదుసార్లు జగజ్జేత అయిన ఆస్ట్రేలియాను కూడా ఓడించేలా కనిపించింది.

ఆస్ట్రేలియాపై అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి
ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా 291 పరుగులు సాధించిన హష్మతుల్లా బృందం.. ఆరంభంలోనే వికెట్లు కూల్చి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించింది. ఈ క్రమంలో అజయ్‌ జడేజాతో పాటు అఫ్గనిస్తాన్‌ శిబిరం మొత్తం సంతోషంలో మునిగిపోయింది.

ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ డ్రెస్సింగ్‌రూంలో కదలికల వల్ల సైట్‌స్క్రీన్‌ డిస్టర్బెన్స్‌గా ఉందంటూ ఆసీస్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ కంప్లైంట్‌ చేశాడు. దీంతో అతడిని కవ్వించేలా జడేజా డ్యాన్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయింది.

మాక్సీ వచ్చాక సీన్‌ రివర్స్‌
కానీ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రాకతో సీన్‌ మారిపోయింది. అప్పటిదాకా అఫ్గనిస్తాన్‌ చేతిలో ఉందనుకున్న మ్యాచ్‌ చేజారిపోయింది. మిస్‌ఫీల్డ్‌, క్యాచ్‌డ్రాప్‌ల మూలంగా మాక్సీకి లైఫ్‌ దొరకగా.. అతడు ఏకండా అజేయ ద్విశతకం బాదాడు. అఫ్గన్‌ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు అనూహ్య రీతిలో విజయం అందించి సెమీస్‌ చేర్చాడు.

జడేజా ఏడ్చే ఉంటాడు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాక్స్‌వెల్‌ క్రీజులో పాతుకుపోయినపుడు అఫ్గనిస్తాన్‌ బౌలర్లు ఎక్కువగా స్ట్రెయిట్‌ బౌలింగే చేశారు. అప్పటికే అతడు గాయపడ్డాడు అయినా కూడా పరుగులు రాబట్టేందుకు అవకాశం ఇచ్చారు.

ఇదంతా చూస్తూ అజయ్‌ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు. మాక్సీ నిలబడి ఉన్నచోటే బౌండరీలు, సిక్సర్లు బాదాడు. అసలు మాక్స్‌వెల్‌ను అవుట్‌ చేయాలని ఏమాత్రం ప్రయత్నం చేసినట్లుగా అనిపించలేదు. ఏదేమైనా వన్డేల్లో ఇది అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌గా మిగిలిపోతుంది’’ అని కోల్‌కతా టీవీతో ముచ్చటిస్తూ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

చదవండి: పాక్‌కు సెమీస్‌ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్‌

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు