SMAT 2023: 42 బంతుల్లో శతక్కొట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్‌

17 Oct, 2023 12:59 IST|Sakshi
సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్‌ శర్మ(ఫైల్‌ ఫొటో)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌, పంజాబ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. రాంచీ వేదికగా ఆంధ్రప్రదేశ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 17) జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్‌ 42 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌.. 9 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా శివాలెత్తాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసిన అన్మోల్‌.. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో అన్మోల్‌ స్పీడ్‌ చూసి టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు కావడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అన్మోల్‌.. స్టీఫెన్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదిన అనంతరం ఔటై, టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

అభిషేక్‌, అన్మోల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆంధ్ర బౌలర్లలో చీపురుపల్లి స్టీఫెన్‌, పృథ్వీరాజ్‌ యర్రా, త్రిపురన విజయ్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. అభిషేక్‌, అన్మోల్‌ బ్యాటింగ్‌ విధ్వంసం ధాటికి ఆంధ్ర బౌలర్లంతా 10కిపైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నారు. హరిశంకర్‌రెడ్డి, పృథ్వీరాజ్‌ అయితే ఏకంగా 15కుపైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నారు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ 42 బంతుల్లోనే శతక్కొట్టిన అభిషేక్‌
అభిషేక్‌ శర్మ లిస్ట్‌-ఏ (దేశవాలీ, అంతర్జాతీయ 50 ఓవర్స్‌ ఫార్మాట్‌) క్రికెట్‌లోనూ 42 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. ఈ శతకం లిస్ట్‌-ఏ క్రికెట్‌లో భారత తరఫున అత్యంత వేగవంతమైన శతకం కావడం మరో విశేషం. 2021లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ ఈ ఘనత సాధించాడు. 

ఐపీఎల్‌లో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌, ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్న అభిషేక్‌.. తన ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో 47 మ్యాచ్‌లు ఆడి 137.4 స్ట్రయిక్‌రేట్‌తో 4 హాఫ్‌సెంచరీల సాయంతో 893 పరుగులు చేశాడు. 

మరిన్ని వార్తలు