బోణీ అదిరింది   

8 Oct, 2018 01:51 IST|Sakshi

యూత్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో తుషార్‌కు, జూడోలో తబాబి దేవిలకు రజతం 

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): యూత్‌ ఒలింపిక్స్‌ పోటీలు మొదలైన తొలిరోజే భారత్‌ రెండు రజతాలతో ఖాతా తెరిచింది. షూటర్‌ తుషార్‌ మానే... జూడో ప్లేయర్‌ తబాబి దేవి తంగ్జామ్‌ రజత పతకాలు గెలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో తుషార్‌ 247.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో సెర్బియా షూటర్లు గ్రిగొరి షమకోవ్‌ (249.2) స్వర్ణం, అలెక్సా మిత్రోవిక్‌ (సెర్బియా) కాంస్యం గెలుచుకున్నారు. చివరి షాట్‌ దాకా భారత ఆటగాడు స్వర్ణం రేసులో నిలిచాడు.

అప్పటి వరకు షమకోవ్‌కు దీటుగా గురి కుదరగా... చివరి షాట్‌ తుషార్‌ను రజతానికి పడేసింది. ఇందులో అతనికి 9.6 పాయింట్లు రాగా, షమకోవ్‌ 9.9 పాయింట్లతో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. మహిళల జూడో 44 కేజీల ఫైనల్లో తబాబి దేవి తంగ్జామ్‌ 1–11తో మరియా జిమినెజ్‌ (వెనిజులా) చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల హాకీలో భారత్‌ 10–0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. రవిచంద్ర, సాగర్, సుదీప్‌ రెండేసి గోల్స్, శివమ్, రాహుల్, సంజయ్, మణిందర్‌ తలా ఒక గోల్‌ చేశారు. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌ లీగ్‌ మ్యాచ్‌లో జక్కా వైష్ణవి రెడ్డి 21–13, 21–6తో ఎలీనా అండ్రూ (స్పెయిన్‌)పై గెలిచింది.   

మరిన్ని వార్తలు