టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలి: గంభీర్‌

23 Nov, 2023 19:47 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ త్వరలోనే టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న రోహిత్‌.. కేవలం  వన్డేల్లో, టెస్టుల్లో మాత్రమే కొనసాగున్నట్లు క్రికెట్‌ వర్గాల్లో తెగ చర్చనడుస్తోంది. రోహిత్‌తో పాటు భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి కూడా గత ఏడాది నుంచి టీ20ల్లో ఆడటం లేదు.

రోహిత్‌ గైర్హజరీలో హార్దిక్‌ పాండ్యా టీ20ల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఇద్దరూ ఆడాలని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

"టీ20 ప్రపంచకప్‌-2024కు రోహిత్‌ శర్మ, కోహ్లి ఇద్దరినీ కచ్చితంగా ఎంపిక చేయాలి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ వ్యవహరించాలి. హార్దిక్‌ టీ20ల్లో సారథిగా ఉన్నప్పటికీ.. రోహిత్‌ను నేను కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నాను. ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ ఎంటో చూపించాడు. రోహిత్‌ను ఎంపిక చేస్తే విరాట్‌ కోహ్లి కూడా ఆటోమేటిక్‌గా జట్టులోకి వస్తాడు.

రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకుంటే, అతడిని బ్యాటర్‌గా కాకుండా కెప్టెన్‌గా ఎంపిక చేయాలి" అని స్పోర్ట్స్‌ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్‌ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ, కోహ్లితో పాటు సీనియర్‌ ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యవహరిస్తున్నాడు.
చదవండి: IPL 2024-Rashid Khan Injury: గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌ షాక్‌.. రషీద్‌ ఖాన్‌కు సర్జరీ!? ఐపీఎల్‌కు దూరం

మరిన్ని వార్తలు