అధికారం మాది.. నీ అంతుచూస్తా

9 Feb, 2018 13:04 IST|Sakshi
ఆస్పత్రి వైద్యాధికారితో రాజీనామా విషయంపై మాట్లాడుతున్న శ్రీనివాసరావు

ప్రభుత్వాస్పత్రి వైద్యుడిపై పట్టణ టీడీపీ కార్యదర్శి ప్రతాపం

ప్రభుత్వాస్పత్రి వైద్యుడిపై పట్టణ టీడీపీ కార్యదర్శి ప్రతాపం

చంపుతామంటూ బెదిరింపులు, దుర్భాషలు

భయభ్రాంతులకు గురై డాక్టర్‌ రాజీనామా

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు.. కేసు  నమోదు

శ్రీకాకుళం,ఇచ్ఛాపురం: పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో కాంట్రాక్టు వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న పొట్టా శ్రీనివాసరావుపై పట్టణ టీడీపీ కార్యదర్శి ప్రతాపం చూపారు. ఆస్పత్రిలో చేరిన రోగికి వైద్యం అందించే విషయంలో జోక్యం చేసుకుని.. అధికారం మాది.. నీ అంతుచూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. చంపుతానంటూ హెచ్చరించడంతో భయభ్రాంతులకు గురైన వైద్యుడు రాజీనామా చేశారు.

వైద్యం అందించారా లేదా?
ఒక ప్రమాదంలో గాయపడిన రత్నాల బీమమ్మ.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్సకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. బీమమ్మ చేరిన విషయాన్ని కుటుంబసభ్యులు టీడీపీ పట్టణ కార్యదర్శి నందిక జానీకి తెలిపారు. వెంటనే ఆయన.. ఆస్పత్రికి వచ్చి.. వైద్యం అందించారా? లేదా అని వైద్యుడు శ్రీనివాసరావుతో పాటు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలాంటివి ఆస్పత్రిలో చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన జానీ.. బుధవారం సాయంత్రం వైద్యుడు ఇంటి వద్దకు వెళ్లి దుర్భాషలాడారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది. నీ అంతు చూస్తా, చంపుతా’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో డాక్టర్‌ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వీటిని తట్టుకోలేని శ్రీనివాసరావు.. తన రాజీనామా పత్రాన్ని ఆస్పత్రి వైద్యాధికారి దామోదర్‌ ప్రదాన్‌కు గురువారం అందజేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వైద్యసేవలు  కరువయ్యే ప్రమాదం
వైద్యులు శ్రీనివాసరావు ఆస్పత్రిలో ఐదేళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గాను జనవరి 26న కలెక్టర్‌ ధనంజయరెడ్డి ఉత్తమ డాక్టర్‌గా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొందిన డాక్టర్‌.. రాజీనామాను ఆమోదిస్తే వైద్యసేవలకు అంతరాయం కలుగుతుందని ఆస్పత్రి వైద్యాధికారి దామోదర్‌ప్రదాన్‌ తెలిపారు. ఇప్పటికే ఆస్పత్రిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటివి జరగడం వల్ల ఆస్పత్రిలో వైద్యసేవలు కరువయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు.

టీడీపీ పట్టణ కార్యదర్శిపై కేసు నమోదు
పొట్టా శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిక జానీపై పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి  రూరల్‌ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం డాక్టర్‌ ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ  బెదిరించారని, గతంలోనూ ఆస్పత్రిలో తన విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు.

మరిన్ని వార్తలు