ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం

31 Aug, 2017 14:43 IST|Sakshi



సాక్షి, ముంబై : ముంబైలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. జేజే నగర్‌ సమీపంలోని పక్‌మెడియా వీధిలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ పదిమంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. కాగా శిథిలాల కింద మరో 20మంది వరకూ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

భవనం కూలిన సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, అగ్నిమాపక సిబ్బందితో పాటు రెస్క్యూ టీమ్‌ కూడా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ 29మందిని శిథిలాల నుంచి వెలికి తీసి, చికిత్స నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని డీసీపీ మనోజ్‌ శర్మ తెలిపారు.

కాగా వర్షాకాల సీజన్‌ ప్రారంభం అయిన దృష్ట్యా నగరంలో 971 భవనాలు ఏ క్షణంలో అయినా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎంసీ (బృహ‌న్ ముంబ‌యి మునిసిప‌ల్ కార్పొరేష‌న్) గుర్తించింది. మహారాష్ట్రలో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాలతో పాటు వరదలతో పదిమంది మరణించారు.

కుండపోత వర్షాలతో కుదేలైన ముంబై ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు బాంబే ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు దీపక్‌ ఆమ్రపుర్కర్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఎల్పైన్‌స్టోన్‌ రోడ్డు సమీపంలో ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. ఆయన మృతదేహం ఈరోజు ఉదయం లభ్యమైంది.