8 మంది సజీవదహనం

27 Dec, 2014 22:24 IST|Sakshi

ప్యాకింగ్ కార్ఖానాలో అగ్నిప్రమాదం  
మరో ముగ్గురికి తీవ్రగాయాలు


భివండీ, న్యూస్‌లైన్: తాలూకాలోని మాన్‌కోలి ప్రాంతంలో శ నివారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. గాయాలపాలైన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ముంబైలోని సైన్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక నిజాంపూర పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. రహనాల్ ప్రాంతంలో మడ్వీ కాంపౌండ్‌లో వస్త్ర తాన్లు ప్యాకింగ్ చేసే కార్ఖానా ఉంది. అందులో పెద్ద ఎత్తున చెక్క, కలప నిల్వచేసి ఉంచారు.

శుక్రవారం రాత్రి కార్ఖానాలో 13 మంది కార్మికులు  నిద్రపోయారు. సుమారు మూడు గంటల ప్రాంతంలో అందులో మంటలు చెలరేగాయి. అయితే అదేసమయంలో అటువైపుగా వచ్చిన గస్తీ పోలీసులు మంటలను గమనించి అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు. కాని వారు వచ్చే సరికి మంటలు పూర్తిగా చుట్టుముట్టాయి. కార్ఖానా నుంచి బయటకు వెళ్లలేక ఎనిమిది అందులోనే చిక్కుకుని ప్రాణాలు వదిలారు. మృతులను అజయ్ రాజ్‌బహదూర్, రాజు చవాన్, గౌరి చవాన్, కాలియా హరిహరన్, మున్నీలాల్ యాదవ్, మురళి మోరియా, త్రివిక్రం, నీరజ్ కుర్మీ లుగా గుర్తించారు.

కాగా గాయపడినవారిలో వినోద్ యాదవ్, బహదూర్ చవాన్, గిరి చవాన్ ఉన్నారు. వీరిలో వినోద్ పరిస్థితి విషమంగా ఉండడంతో ముంబైకి తరలించారు. మిగతావారు స్థానిక ఇందిరా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

నిజాంపూర పోలీసులు కేసు నమోదుచేసి కార్ఖానా యజమానులైన మన్వర్ అలీ, జంగ్ బహదూర్‌ఖాన్, ఇస్తియాక్ అహ్మద్, శౌకత్ అలీలను అరెస్టు చేశారు. సజీవ దహనం విషయం తెలుసుకున్న జిల్లాధికారి అశ్విని జోషి సంఘటన స్థలాన్ని సందర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శిథిలాలను తొలగించే పనులు పూర్తయిన తరువాత దర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు