‘పాల’ల్లో భిన్న వాదం

20 Jun, 2017 04:59 IST|Sakshi
‘పాల’ల్లో భిన్న వాదం

రసాయనాలు లేవన్న ప్రభుత్వం
నాణ్యత తగ్గినా ప్రాణహాని లేదని ప్రకటన
కోర్టుకు ఆరోగ్య శాఖ నివేదిక
మంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా వివరణ
సర్వత్రా విమర్శలు

ప్రైవేటు డెయిరీల పాలలో రసాయనాల మిశ్రమం వ్యవహారం భిన్న స్వరానికి దారితీసింది. ఆ పాలల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టుగా పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన ప్రకటన చేస్తే, అందుకు భిన్నంగా అబ్బే.. అలాంటివి ఏవీ లేవు అని ఆరోగ్య శాఖ కోర్టుకు నివేదించడం చర్చకు దారితీసింది.
సాక్షి, చెన్నై : ప్రైవేటు పాలలో రసాయనాలు కలుపుతున్నట్టుగా పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ పదిరోజుల క్రితం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రసాయనాలతో క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు పాలను పరిశోధనకు పంపించామని, రసాయనాలు ఉన్నట్టుగా ధ్రువీకరించిన పక్షంలో ఆయా ప్రైవేటు సంస్థలపై కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ఈ విషయంగా సీఎం పళని స్వామితో పలుమార్లు చర్చలు జరిపిన మంత్రి, తన వాదనకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు.

అదే సమయంలో మంత్రి సంచలన ఆరోపణల్ని అస్త్రంగా చేసుకున్న న్యాయవాది సూర్యప్రకాష్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.  ప్రధాన న్యాయమూర్తి ఇందిర బెనర్జీ, న్యాయమూర్తి సుందరేషన్‌ నేతృత్వంలోని ప్రధాన బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తమిళనాడులో సరఫరా అవుతున్న ప్రైవేటు పాలు అత్యధికంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నట్టు, ఆయా సంస్థల్లో ఏం జరుగుతోందో ఎవరీకి తెలియదని కోర్టుకు సూర్య ప్రకాష్‌ నివేదించారు. కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని బెంచ్‌ సైతం అభిప్రాయ పడింది.

ఈ రసాయనాల మిశ్రమం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారోనని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. నిగ్గు తేల్చేందుకు ఓ కమిటీని రంగంలోకి దించతున్నట్టుగా గత వారం జరిగిన  వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ వారం వ్యవధిలో ఏం జరిగిందో ఏమోగానీ, పాడి, డెయిరీ మంత్రి మౌనం వహించడం మొదలెట్టినట్టున్నారు. అందుకే కాబోలు ఆరోగ్యశాఖ రంగంలోకి దిగి, అబ్బే రసాయనాలు ఏవీ పాలల్లో లేవంటూ కోర్టుకు నివేదించడం గమనార్హం. మంత్రి సంచలన ప్రకటనకు భిన్నంగా ఆరోగ్య శాఖనివేదిక సోమవారం హైకోర్టుకు చేరడం చర్చకు దారితీసింది.

నాణ్యత తగ్గినా ప్రాణ హాని లేదు
రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి తరపున కోర్టుకు చేరిన నివేదికలో 2011–17 మధ్య కాలంలో తాము జరిపిన పరిశీలన, పరిశోధనల్లో ప్రాణానికి హని కల్గించే  రసాయనాలు లభించ లేదని వివరించారు. 888 చోట్ల జరిపిన పరిశోధనల్లో , 137 చోట్ల మాత్రం నీళ్లు, విజిటబుల్‌ ఆయిల్‌ మిశ్రమం మాత్రం గుర్తించినట్టు పేర్కొన్నారు. అలాగే, మరికొన్ని చోట్ల పాల ప్యాకెట్ల మీద తేదీలు పేర్కొన లేదని, కాలం చెల్లినవి ఉన్నట్టుగా గుర్తించామని వివరించారు.

అలాగే, పాల ఉత్పత్తుల్లో 338  చోట్ల జరిపిన పరిశీలనలో 196 చోట్ల సురక్షితం అని, 132 చోట్ల కాలం చెల్లిన వాటిని మళ్లీ కొత్తగా తయారు చేయడం, కొన్ని రకాల మిశ్రమాలు ఉండటాన్ని గుర్తించామని పేర్కొన్నారు. పాలలో, పాల ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గినా, ప్రాణానికి హాని కల్గించే రసాయనాలు లేవు అని కోర్టుకు స్పష్టంచేశారు. ఇక, తాము జరిపిన తనిఖీల్లో పట్టుబడ్డ వారి నుంచి జరిమానాల రూపంలో రూ.10.26 లక్షలు వసూలు చేసినట్టు నివేదించారు.. అయితే, మంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా ఆరోగ్య శాఖ నివేదిక ఉండటంతో తదుపరి సాగే విచారణలో కోర్టు ఏమేరకు స్పందించనుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు