మహాపంచాయత్ భగ్నం!

23 Sep, 2014 22:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌తో అధికారిక నివాసాన్ని ఖాళీ  చేయించడాన్ని వ్యతిరేకిస్తూ రాజధానిలో ఆర్‌ఎల్‌డీ నిర్వహించ తలపెట్టిన మహాపంచాయత్‌ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అజిత్ ఖాళీ చేసిన బంగ్లా ఎదుటే మహాపంచాయత్ నిర్వహించేందుకు ఆర్‌ఎల్‌డీ పిలుపునివ్వడంతో సదరు బంగ్లా ఉన్న ప్రాంతమైన 12 తుగ్లక్‌రోడ్‌కు దారితీసే రహదారులన్నింటినీ బారీకేడ్లతో మూసివేశారు. లూటియెన్స్ జోన్‌లో 144 సెక్షన్‌ను అమలు చేయడమే కాకుండా రేస్‌కోర్సు రోడ్డు మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. ఉదయం 8.20 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మూసివేయడంతో 12 తుగ్లక్ రోడ్డుకుచేరుకోలేకపోయారు. చేరుకున్న కొంతమందిని పోలీసుల అదుపులోకి తీసుకొని ఠాణాలకు తరలించారు.
 
 అనుమతి లేదని ముందే ప్రకటించిన పోలీసులు
 తమ నేతతో బంగ్లా ఖాళీ చేయించేందుకు ఎంసీడీ అనుసరించిన తీరును ఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు తీవ్రంగా తప్పుబట్టారు. సదరు బంగ్లాకు నీటి సరఫరా బంద్ చేయడం, కరెంటు సరఫరా బంద్ చేయడం వంటి చర్యలను ఖండించారు. దీంతో ఢిల్లీకి నీటి సరఫరాను అడ్డుకునేందుకు నగర శివార్లలో ఆందోళన నిర్వహించిన ఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు మంగళవారం రాజధానిలో తమ సత్తా నిరూపించేందుకు ప్రయత్నించారు. అజిత్‌సింగ్‌తో ఖాళీ చేయించిన బంగ్లా ఎదుటే మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే ప్రకటించారు.
 
 అయినప్పటికీ ఆందోళనకారులు పంచాయత్ నిర్వహించేందుకే నిర్ణయించుకోవడంతో ముందుజాగ్రత్తగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు కూడా విధించారు. ఆర్‌ఎల్‌డీ మద్దతుదారులను అడ్డుకునేందుకు పోలీ సు లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అజిత్‌సింగ్ బంగ్లా వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాాలను మోహరించడంతోపాటు తుగ్లక్ రోడ్‌తోపాటు బంగ్లాకు దారితీసే ప్రధాన రహదారులపై పలుచోట్ల బారికేడ్లను అమర్చారు. బారి కేడ్ల కారణంగా ఆర్‌ఎల్ డీ మద్దతుదారులు పెద్ద ఎత్తున అజిత్ సింగ్ నివాసానికి చేరుకోలేకపోయారు. చేరుకున్నవారిని పోలీసులు వాహనాలలో ఎక్కించుకొని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
 
 ట్రాఫిక్ ఆంక్షలతో నగరవాసుల ఇబ్బందులు
 ఉదయం  రద్దీ వేళల్లో రోడ్లపై బారికేడ్లను అమర్చడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. బారికేడ్ల ప్రభావం దక్షిణ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ ట్రాఫిక్‌పై కనిపించింది. ఐఎన్‌ఏ, ఔరంగాజేబ్ రోడ్, తీన్‌మూర్తి రోడ్డుతో పాటు పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. రేస్‌కోర్సు మెట్రోస్టేషన్‌ను కూడా మూసివేయడం మెట్రో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. 12 తుగ్లక్‌రోడ్‌లో అజిత్ సింగ్ 30 సంవత్సరాలుగా నివాసముంటున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన సింగ్ సదరు బంగళాను ఖాళీ చేయాలని ప్రభుత్వం అంటోంది. అయితే తన తం డ్రి, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ ఈ బంగ్లాలో నివాసమున్నారని, దానిని చరణ్‌సింగ్ మెమోరియల్‌గా ప్రకటించాలని అజిత్‌సింగ్ డిమాండ్ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు