సీతయ్య... ఎవరి మాట వినడు!

18 Jul, 2015 08:56 IST|Sakshi
సీతయ్య... ఎవరి మాట వినడు!

సొంత ప్రయోజనాలే ముఖ్యం!
ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని వైనం
 

సీతయ్య... ఎవరి మాట వినడు! అని వెండితెరపై హరికృష్ణ పలుకుతుంటే థియేటర్ మారుమోగింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లోనూ ఓ సీతయ్య ఉన్నాడు. ఆయన కూడా ఎవరి మాట వినడు. ఆయనకు ప్రజల సంక్షేమం కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యం. ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇంతకీ ఆ సీతయ్య ఎవరు అని అనుకుంటున్నారా? ఆయనే మండ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబరీష్!!
 
మండ్య : రోమ్ నగరం మొత్తం మంటల్లో కాలి బూడిదవుతున్న తరుణంలో నీరో రాజు ఫీడేలు వాయిస్తున్నట్లుంది మంత్రి అంబరీష్ పనితీరు. మండ్య జిల్లాలో రైతులు సాగు చేసిన చెరుకు పంటకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబరీష్ మాత్రం తనకేమీ పట్టనట్లు అపెక్స్ బ్యాంకు ప్రతినిధి ఎంపిక విషయంలో తన అభిప్రాయానికి విలువనివ్వలేదంటూ ప్రభుత్వంపై అలకబూనారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న జిల్లా మండ్యకు పేరుంది. రైతుల తరుఫున నిలిచి వారిలో మనోస్థైర్యం నింపాల్సిన తరుణంలో కనీసం జిల్లాలో సైతం ఆయన పర్యటించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. అంతేకాదు, రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగాను ఆయన వ్యవహరించకపోవడం అన్నదాతలను మరింత కుంగదీస్తోంది.  

 ప్రారంభానికి నోచుకోని చక్కెర ఫ్యాక్టరీలు
 మండ్య జిల్లాలో ఐదు చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నా... అవి ఇంత వరకు ప్రారంభం కాలేదు. దీంతో 30 వేల హెక్టార్లలో రైతులు సాగు చేసిన చెరుకుకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. అంతేకాదు సాగు నీరు అందక చెరుకు పంట ఎండిపోతోంది. దీంతో కొందరు అన్నదాతలు రెండవ పంట పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటూ చెరుకు పంటకు నిప్పు పెట్టేస్తున్నారు. ఈ దశలోనే పంట పెట్టుబడుల కింద తీసుకున్న అప్పులు తీర్చాలంటూ ఒత్తిళ్లు ప్రారంభం కావడంతో వాటిని తీర్చే మార్గం కానరాక బలవన్మరణాలకు పాల్పడతున్నారు. పండించిన చెరుకు పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో పాటు దిగుబడిని సుదూరంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీలకు తరలించడం మరింత భారంగా మారడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
 
సంక్షోభంలో రైతులకు దూరంగా

మండ్య జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రజాప్రతినిధులు కనీసం ఆ  దిశగా అడుగేయడం లేదు. ఆఖరుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబరీష్ సైతం రైతులకు అండగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మండ్య జిల్లా వాసులను ఆగ్రహానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో బోర్డులు, నామినేటెడ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో తన మద్దతుదారులకు అవకాశం కల్పించలేదన్న కారణంతో సీఎం సిద్ధరామయ్యపై అలకబూనిన ఆయన వైఖరి జిల్లా వాసులకు కొత్తేమి కాదు. అయితే జిల్లా వాసుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. మంత్రిగా అంబరీష్ పూర్తిగా విఫలమయ్యారంటూ పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు