అంధత్వం మనసుకు కాదు

22 May, 2015 23:46 IST|Sakshi
అంధత్వం మనసుకు కాదు

- సీఏబీఐ ప్రధాన కార్యదర్శి మహంతేశ్
- విదేశీ పర్యటనకు బయలుదేరిన అంధ క్రికెట్ జట్టు
సాక్షి, ముంబై:
‘లక్ష్య సాధనకు పట్టుదల ముఖ్యం. అంధత్వమనేది మనిషికే కానీ మనసుకు కాదు. పట్టుదలే ముందుకు తీసుకెళుతుంది’ అని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇండియా (సీఏబీఐ) ప్రధాన కార్యదర్శి జి.కె.మహంతేశ్ అన్నారు. అంధుల జట్టు శుక్రవారం విదేశీ పర్యటనకు బయలుదేరిన సందర్భంగా వర్లీ సీఫేస్‌లో ఆయన మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అంధులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రికెటర్లుగా తీర్చిదిద్దామన్నారు. ఇంగ్లండ్‌కు బయలుదేరిన ఈ జట్టు 24 నుంచి మూడు వన్ డే మ్యాచ్‌లు ఆడుతుందని, 31న తిరిగి స్వదేశానికి చేరుకుంటుందన్నారు. అంధ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబరులో వరల్డ్‌కప్ గెలుచుకున్నా వీరికి గుర్తింపు లభించడం లేదన్నారు. బీసీసీఐలో అంధుల జట్టును చేర్చుకోవాలని  విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదన్నారు.

జట్టులో నలుగురు తెలుగు యువకులు
విదేశీ పర్యటనకు వెళ్లిన అంధ క్రికెట్ జట్టులో నలుగురు తెలుగు యువకులు ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దుర్గారావు, అజయ్‌కుమార్ రెడ్డి, దూన వెంకటి జట్టులో ఉన్నారు.   

>
మరిన్ని వార్తలు