రజనీకాంత్‌తో పోటీకి దిగుతున్న ధనుష్‌

11 Dec, 2023 06:49 IST|Sakshi

నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌. నటి ప్రియాంక అరుణ్‌ మోహన్‌ నాయకిగా నటించగా నివేదిత సతీస్‌, జాన్‌ కొక్కెన్‌, సుమేష్‌కుమార్‌, శివరాజ్‌ కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అరుణ్‌ మాదేశ్వరన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

కాగా కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ముందుగా నిర్మాతలు ప్రకటించారు. ఇదే సమయంలో రజనీకాంత్‌ సినిమా కూడా విడుదల కానుంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లాల్‌ సలామ్‌ సినిమా కూడా పొంగల్‌కు రెడీ అయిపోయింది. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రజనీకాంత్‌ సినిమాతో పోటీ ఎందుకని కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని ముందుగానే అంటే డిసెంబర్‌ నెలలోనే విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారమే అంటే సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంక్రాంతి పండుగరోజు రజనీకాంత్‌కు, ధనుష్‌కు మధ్య పోటీ తప్పనిసరిగా మారింది. లాల్‌ సలామ్‌ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. అదే విధంగా ధనుష్‌ నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్ర టీజర్‌, పాటలు విడుదలై ట్రెండింగ్‌ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్స్‌ పైనే సినీ వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. కెప్టెన్‌ మిల్లర్‌ 2024 జనవరి 15న విడుదల అవుతుండగా... లాల్‌ సలామ్‌ సంక్రాంతికి విడుదల అని మాత్రమే ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు