సుప్రీం తీర్పునూ లెక్క చేయలేదు

25 Aug, 2016 22:37 IST|Sakshi
సుప్రీం తీర్పునూ లెక్క చేయలేదు

భారీ ఎత్తులో పిరమిడ్లు నిర్మించిన మహారాష్ట్ర వాసులు
ముంబై:
దహీ హండీ (ఉట్టి) కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్‌ ఎత్తు పెంచడానికి అనుమతివ్వబోంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కృష్ణభక్తులు పట్టించుకోలేదు. కృష్ణాష్టమి సందర్భంగా 20 అడుగులకు మించి పిరమిడ్లను నిర్మించి గురువారం ఉట్టి ఉత్సవం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా దాదర్‌ ప్రాంతంలో  భక్తులు 20 అడుగుల మానవ పిరమిడ్‌ రూపంలో నేలపై పడుకుని నిరసన తెలిపారు.  దహీ హండీ కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్‌ ఎత్తు విషయంలో హైకోర్టు తీర్పునే కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

20 మీటర్లకు మించి ఎత్తు పెంచలేమని ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది.  రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆదేశాలను ఉల్లంఘించారు.  పలుచోట్ల 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మానవ పిరమిడ్లను నిర్మించే ఉట్టికుండలను పగులకొట్టారు. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఎమ్మెన్నెస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే సమర్థించుకున్నారు. ’మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం. ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదు. కోర్టు ఆదేశాలు మాత్రమే. అందుకు మీకు ఇష్టమున్న రీతిలో మానవ పిరమిడ్లు నిర్మించుకొని గోవిందులకు (ఉట్టి వేడుకలో పాల్గొనేవారికి) చెప్పాను’ అని  ఠాక్రే మీడియాతో అన్నారు. మహారాష్ట్రలో ఏటా జన్మాష్టమి సందర్భంగా దహీహండీ నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు