మూడు కిలోల పసిడి పట్టివేత

22 Aug, 2014 02:00 IST|Sakshi

బెంగళూరు : పెద్ద మొత్తంలో తమిళనాడుకు తరలిస్తున్న బంగారం, నగదును స్థానిక హైగ్రౌండ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నటరాజ్, బాల, రాంకుమార్‌ని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. నిందితుల నుంచి మూడు కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు, రూ. 42 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన నిందితుల వివరాలను వెల్లడించారు.

బెంగళూరు సెంట్రల్ విభాగంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం అర్ధరాత్రి నుంచి నాకాబందీ నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఆటోలో నిందితులు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా ఆనందరావు సర్కిల్‌లోని జేడీఎస్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఆటోలో ఉన్న ముగ్గురి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారి వద్ద ఉన్న సూట్‌కేస్‌ను తెరిపించి చూశారు.  

అందులో బంగారు బిస్కట్లు, రూ. 42 లక్షలు ఉండడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరు బెంగళూరులో బంగారు బిస్కట్‌లు కొనుగోలు చేసి అక్రమంగా తమిలనాడుకు తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితులను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని డీసీపీ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు