మూడు స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ పూర్తి | Sakshi
Sakshi News home page

మూడు స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ పూర్తి

Published Fri, Aug 22 2014 1:55 AM

మూడు స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ పూర్తి - Sakshi

  • మూడు స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ పూర్తి
  •   ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
  •   25న ఫలితాలు వెల్లడి
  •   బళ్లారిలో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన అభ్యర్థులు
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు/బళ్లారి :  రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 25న ఫలితాలు వెలువడుతాయి. బళ్లారి గ్రామీణ, శివమొగ్గ జిల్లా శికారిపుర, బెల్గాం జిల్లా చిక్కోడి-సదలగ నియోజక వర్గాలకు గతంలో ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

    ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. దీంతో అనేక పోలింగ్ కేంద్రాల వద్ద చాంతాడంత క్యూలు కనిపించాయి. మధ్యాహ్నం వరకు కొద్ది చోట్ల పోలింగ్ మందకొడిగా సాగినా, అనంతరం పుంజుకుంది. పరిమిత నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగినందున, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకు రావడానికి తుదికంటా ప్రయత్నించాయి.

    కాగా జేడీఎస్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య ముఖాముఖి పోటీ ఏర్పడింది. మాజీ మంత్రి బీ. శ్రీరాములు ప్రాతినిధ్యం వహించిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి ఓబులేశు, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై. గోపాలకృష్ణలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  శికారిపురలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప తనయుడు బీవై. రాఘవేంద్ర, కాంగ్రెస్ అభ్యర్థి శాంత వీరప్ప గౌడను ఎదుర్కొన్నారు.

    చిక్కోడి-సదలగలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ హుక్కేరితో బీజేపీ అభ్యర్థి మహంతేశ్ కవటగి మఠ తలపడ్డారు. గత ఏడాది మేలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ, శికారిపుర నియోజక వర్గాలను బీజేపీ గెలుచుకోగా, చిక్కోడి-సదలగలో కాంగ్రెస్ విజయం సాధించింది. తన కుమారునికి ఉప ఎన్నికల్లో టికెట్టు ఇవ్వాలనే షరతుపై యడ్యూరప్ప లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. చిక్కోడి-సదలగలో ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాశ్ హుక్కేరికి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో చోటు కూడా లభించింది. లోక్‌సభ ఎన్నికల్లో చిక్కోడి స్థానానికి సరైన అభ్యర్థి లేకపోవడంతో అధిష్టానం ఆయనను పోటీలో దింపింది. ఉప ఎన్నికలో ఆయన తనయుడు గణేశ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు.
     
    ఇద్దరు అభ్యర్థులకు ఓటు లేదు
     
    బళ్లారి గ్రామీణ ఉప ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. బీజేపీ తరుపున ఓబుళేసు, కాంగ్రెస్ తరుపున ఎన్‌వై గోపాలకృష్ణ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. వీరికి బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలో ఓటు లేదు. బళ్లారి అర్బన్ పరిధిలో ఓబులేసుకు ఓటు ఉంది. ఎన్‌వై గోపాలకృష్ణ స్థానికేతరుడు కావడంతో ఆయనకు ఓటు లేకుండాపోయింది.  
     

Advertisement
Advertisement