సంబరాలు డౌటే..!

30 Dec, 2014 07:15 IST|Sakshi
సంబరాలు డౌటే..!

* నూతన సంవత్సర వేడుకుల అనుమతి అనుమానమే?
* ఇప్పటికే విక్రయించిన నూతన సంవత్సర వేడుకల టిక్కెట్లు
* నగదు వెనక్కి ఇవ్వాలని పరుగుతీస్తున్న యువత

బెంగళూరు:  ప్రతి సంవత్సరం ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులలో అత్యంత వైభవంగా నిర్వహించే నూతన సంవత్సరం వేడుకలకు ఈ సంవత్సరం (2015) అనుమతి ఇచ్చే అవకాశం తక్కువగా ఉన్నాయని పోలీసు వర్గా లు అంటున్నాయి. ఆదివారం రాత్రి ఎంజీ రోడ్డు సమీపంలోనే బాంబు పేలుడు జరగడం, ఎంజీ రోడ్డులో జరిగే నూతన సంవత్సర వేడుకలకు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తారు.

ఈ సందర్భంలో సోదాలు, తనిఖీలు చేయడం  కష్టం అవుతుందని కొందరు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడులకు అనుమతి ఇవ్వడం అంత మంచిది కాదని కొందరు అధికారులు అంటున్నారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర బాంబు పేలుడు జరిగినా కొన్ని గంటల వ్యవధిలో స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించి అందరి దగ్గర శభాష్ అనిపించుకున్న బెంగళూరు పోలీసులు.. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే క్రికెట్ స్టేడియం వేరు, బహిరంగ ప్రాంతం వేరు అని పోలీసు వర్గాలు అంటున్నాయి.
 
మా డబ్బు తిరిగి ఇవ్వండి సార్
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ రాత్రి నుంచి జనవరి వేకువ జామున రెండు గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్‌లు, పబ్‌లు, హొటల్‌లు నిర్వహించరాదని పోలీసులు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జనవరి 1వ తేదీన వేకువ జామున రెండు గంటల వరకు వ్యాపారాలు చేసుకొవచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అర్దరాత్రి ఒంటి గంటలకు వ్యాపారాలు నిలిపి వేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం రాత్రి నగరంలో బాంబు పేలుడు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎంజీ రోడ్డు, బ్రిగే డ్ రోడ్డు, జయనగర, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, ఇందిరానగర, శివాజీనగర, రెసిడెన్సీ రోడ్డు, కన్నింగ్‌హొం రోడ్డు, దోమ్మలూరు, పాత మద్రాసు రో డ్డు, పాత ఎయిర్ పోర్టు రోడ్డు, బెంగళూరు- బళ్లారి రోడ్డు, గాంధీనగర, డబుల్‌రోడ్డు, శాంతినగర, మైసూరు రోడ్డు, కంగేరి, ఎలక్ట్రానిక్ సిటీ, కోరమంగల తదితర ప్రాంతాల్లోని పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ ఫ్యామిలి రెస్టారెంట్‌ల నిర్వహకులు నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని టిక్కెట్‌లు విక్రయించారు.

ఒక్కోక్క టిక్కెట్  రూ. మూడు వేల నుంచి రూ. 25, రూ. 50 వేల వరకు ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవచ్చని భావిం చిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు,  ఐటీ బీటీ, కార్పొరేట్ ఉద్యోగులు ఇప్పటికే వారికి అవరసరమై టిక్కెట్‌లు బుక్ చేసుకున్నారు. ఎక్కువగా ఇక్కడి ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, రెసిడెన్సీ రోడ్డు తదితర చోట్ల ఉన్న పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లలో టిక్కెట్‌లు బుక్ చేసుకున్నారు.

ఆదివారం రాత్రి బాంబు పేలుడు జరగడంతో టిక్కెట్‌లు తీసుకున్న వారు హడిలిపోయారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా  వెళ్లి వచ్చే సమయంలో జరగరానిది జరిగితే ఎలా అని భయపడుతున్నారు. సోమవారం ఇక్కడి ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, రెసిడెన్సీ రోడ్డులలోని పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లు చేరుకున్న కొందరు తాము తీసుకున్న టిక్కెట్‌లు వెనక్కు తీసుకుని నగదు చెల్లించాలని మనవి చేశారు. నూతన సంవత్సరం వేడుకులు నిర్వహించడానికి టిక్కెట్‌లు విక్రయించిన వారు తలలు పట్టుకున్నారు. కొందరు నిర్వహకులు టిక్కెట్ ధరలో 30 శాతం కట్ చేసి మిగిలిన 70 శాతం నగదు తిరిగి చెల్లిస్తున్నారు.

మరిన్ని వార్తలు