టికెట్ దొరికి ఉంటే.... మృత్యువు తప్పేది | Sakshi
Sakshi News home page

టికెట్ దొరికి ఉంటే.... మృత్యువు తప్పేది

Published Tue, Dec 30 2014 7:16 AM

టికెట్ దొరికి ఉంటే.... మృత్యువు తప్పేది

సాక్షి, బెంగళూరు:సెలవుల్లో క్రిస్మస్ వేడుకను తమ వారితో కలిసి గడిపేందుకు నగరానికి వచ్చారు. క్రిస్మస్ వేడుకలు పూర్తై అనంతరం ఆదివారం రాత్రే చెన్నైకి బయలుదేరి వెళ్లాలనుకున్నారు. కానీ విధి రాత వేరేలా ఉంది. ఆ కుటుంబానికి ఆదివారం సాయంత్రం ట్రైన్‌కి టికెట్‌లు లభించలేదు. దీంతో వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఎలాగో ప్రయాణం వాయిదా పడింది కదా అని బంధువులతో కలిసి సరదాగా బయటికి వచ్చారు. అయితే వారికేం తెలుసు మృత్యువు ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి వెనకాలే వస్తోందని, బంధువులతో కలిసి సరదాగా ఫన్‌జోన్‌కు వెళ్లాలనుకుంటుండగానే బాంబు రూపంలో ఆమెను మృత్యువు కబళిం చింది.

అలా మృత్యువుకు బలైన మహిళే భవాని. ఆదివారం సాయంత్రం రైలుకే కనుక వారికి టికెట్‌లు లభించి ఉంటే ఈ దురదృష్టకర ఘటన జరిగి ఉండేది కాదని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాలు...చెన్నై నగరానికి చెందిన భవాని(38) క్రిస్మస్‌సెలవుల కారణంగా నగరంలోని దొడ్డమావళ్లిలోని తన బంధువుల ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు చెన్నైలో పాతటైర్‌ల వ్యాపారాన్ని నిర్వహించే భర్త బాలన్(37), పిల్లలు భరత్(13), లక్ష్మీదేవి(11)సైతం నగరానికి వచ్చారు.

క్రిస్మస్ వేడుకల అనంతరం తిరిగి ఆదివారం సాయంత్రం చెన్నైకి వెళ్లాలని భావించినా, టికెట్‌లు లభించక పోవడంతో ప్రయాణాన్ని సోమవారానికి వాయిదా వేసుకున్నారు. దీంతో తన బంధువులతో కలిసి చర్చ్‌స్ట్రీట్‌కు చేరుకొని ఎంపైర్ హోటల్ వద్ద తమ కారును నిలిపి ఇదే ప్రాంతంలోని ఓ ప్లేజోన్‌కు వెళుతుండగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో బాంబుకు సమీపంలో నడుస్తున్న భవాని తలలోకి లోహపు పదార్థాలు బలంగా వెళ్లి గుచ్చుకున్నాయి. దీంతో ఆమె మెదడులో తీవ్ర రక్తస్రావమై భవానీ మృతి చెందారు. భవానీ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా భవానీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement