ఇక సుప్రీంకు..

16 Feb, 2017 01:52 IST|Sakshi
ఇక సుప్రీంకు..

సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌ కిషన్‌ కౌల్‌ పదోన్నతిపై సుప్రీంకోర్టులో అడుగు పెట్టనున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో బుధవారం రాష్ట్ర హైకోర్టులో తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక, మద్రాసు హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా ఎవర్ని నియమిస్తారో అన్న ఎదురుచూపుల్లో న్యాయ వర్గాలు పడ్డాయి. శ్రీనగర్‌కు చెందిన సంజయ్‌కిషన్‌ కౌల్‌ 2014 జూలై 26వ తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజయ్‌ బాధ్యతలు స్వీకరించారు. కేసుల సత్వర పరిష్కారంతోపాటు, హైకోర్టు, మదురై ధర్మాసనంలలో భద్రతా పరంగా చర్యల్ని వేగవంతం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాల గొడుగు నీడలోకి తీసుకొచ్చారు. న్యాయ పరంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సుమోటో కేసులతో ప్రభుత్వాన్ని బెంబేలెత్తించారని చెప్పవచ్చు.

 అన్నాడీఎంకే ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా వ్యవహరిస్తూ, పలు విషయాల్లో ముచ్చమటలు పట్టించారు. ప్రభుత్వానికి పలు మార్లు అక్షింతలు వేయడంతో పాటు జరిమానా మోత సైతం మోగించారు.  ప్రధానంగా హైకోర్టులో ఖాళీల భర్తీకి సంజయ్‌ కిషన్‌ కౌల్‌ చర్యలు అభినందనీయం. ముౖప్పై మందిలోపు ఉన్న హై కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 60కు సమీపంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. న్యాయపరంగా అందర్నీ కలుపుకెళ్లే తత్వం కల్గిన సంజయ్‌ కిషన్‌ కౌల్‌కు ప్రస్తుతం పదోన్నతి లభించింది. ఆయన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. స్వయంగా ఈ వివరాలను కోర్టులో సంజయ్‌ కిషన్‌ కౌల్‌ పేర్కొనడం గమనార్హం.

న్యాయవాది యానై రాజేంద్రన్‌ ఓ కేసును అత్యవసరంగా పరిగణించి విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్‌ కౌల్‌ను ఉదయం విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ కేసును అత్యవసరంగా తాను స్వీకరించ లేనని, అవసరం అయితే, మరోబెంచ్‌కు బదిలీ చేస్తానని ప్రకటించారు. దీంతో కోర్టు హాల్‌లో ఉన్నవాళ్లందరూ విస్మయానికి గురయ్యారు. తనకు ఇదే చివరి రోజు అని, సుప్రీంకోర్టుకు పదోన్నతి మీద వెళ్తున్నట్టు ప్రకటించారు. దీంతో పక్కనే ఉన్న మరో న్యాయమూర్తి సుందరేష్‌తో పాటు కోర్టు హాల్‌లో ఉన్న వాళ్లందరూ సంజయ్‌ కిషన్‌ కౌల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కౌల్‌ పదోన్నతి మీద వెళ్తుండడంతో, ఇక, మద్రాసు హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి ఎవరన్న చర్చ బయలు దేరింది. ఏ రాష్ట్రం నుంచి ఎవరు వస్తారో అన్న ఎదురు చూపుల్లో న్యాయవర్గాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు