నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు

17 Nov, 2023 05:25 IST|Sakshi

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌  

న్యూఢిల్లీ: అడ్వొకేట్‌ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్‌ సభ్యులు కొందరు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇటీవల హార్వర్డ్‌ లా కాలేజీ సెంటర్‌ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్‌ హైకోర్టు బార్‌ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు.

మరిన్ని వార్తలు