హోమ్ వర్క్ చేయడానికి...

11 Sep, 2014 08:45 IST|Sakshi
హోమ్ వర్క్ చేయడానికి...

చెన్నై: హోమ్ వర్క్ చేయడానికి సెలవు అవసరం కావడంతో పాఠశాలలో బాంబు ఉందని ఫోన్ చేశానని ప్లస్ వన్ విద్యార్థి మంగళవారం పోలీసులకు తెలిపాడు. అతన్ని బాలల జువైనల్ హోమ్‌కు తరలించారు. చెన్నై, పోలీసు కంట్రోల్ రూమ్‌కు సోమవారం ఉదయం ఫోన్ చేసిన ఒక బాలుడు, వలసరవాక్కం ఆల్వార్తినగర్‌లో ఉన్న వెంకటేశ్వర పాఠశాలలోను, విరుగంబాక్కం న్యూకాలనీలో ఉన్న జాన్స్ పాఠశాలలోను బాంబులు పెట్టినట్టు తెలిపాడు. కొద్దిసేపట్లో అవి పేలిపోతాయని అని బెదిరించి ఫోన్ కట్ చేశాడు. దీంతో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ నిపుణులు వలసరవాక్కం, విరుగంబాక్కం పోలీసులు ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను బయటకు పంపించివేసి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పోలీసుల తనిఖీల్లో అది బాంబు బూచీ అని తేలింది.
 
ఈ విషయమై విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఫోన్ కాల్ ఏంజీఆర్ నగర్ నుంచి వచ్చినట్టుగాను, సెయింట్ జాన్స్ పాఠశాలలో ప్లస్ వన్  విద్యార్థి ఫోన్ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆ విద్యార్థిని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో శని, ఆదివారాల్లో పాఠశాలకు సెలవు కావడంతో ఉపాధ్యాయులు ఎక్కువ హోమ్ వర్క్ ఇచ్చారు. వినాయక నిమజ్జనానికి స్నేహితులతో వెళ్లాను. దీంతో హోమ్‌వర్క్ చేయలేదు. సోమవారం ఉపాధ్యాయులు హోమ్ వర్క్ గురించి అడుగుతారని భయపడి, సెలవు కోసం బాంబు బెదిరింపు కాల్ చేశాను అని విద్యార్థి వెల్లడించాడు. నేను చేసిన తప్పును తెలుసుకున్నానని బోరున విలపించాడు. తనను క్షమించి విడిపించాలని విజ్ఞప్తి చేశాడు. అయినప్పటికీ అతనిపై కేసు నమోదు చేసి కెల్లిస్‌లో ఉన్న బాలల జువైనల్ హోమ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు