దేశాన్ని రాష్ట్రం నడిపించాలి

7 Feb, 2017 03:01 IST|Sakshi
దేశాన్ని రాష్ట్రం నడిపించాలి
 • నూరు శాతం ఫలితాలు సాధించేలా బడ్జెట్‌ రూపకల్పన
 • మూడు రోజుల్లోగా శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలు అందించాలి
 • గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ గవర్నెన్స్‌ పేరిట ప్రత్యేక సంస్థ ఏర్పాటు
 • కార్యదర్శులు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి సమీక్ష 
 • సాక్షి, అమరావతి: రాష్ట్రం ముందుండి దేశాన్ని నడిపించాలని, ప్రభుత్వ శాఖలు పట్టుదలతో నూరు శాతం ఫలితాలు సాధించేలా బడ్జెట్‌ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నిధుల వ్యయం, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపులు ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి సోమవారం వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను కొన్ని శాఖలు సమర్థంగా వ్యయం చేయడం లేదని, కేంద్రం కేటాయించిన నిధులను వ్యయం చేసి, పూర్తి స్థాయిలో మిగతా నిధులను తెచ్చుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.

  కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేలాగ ప్రణాళికలను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అనుభవం, వనరులు, సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశానికి నాయకత్వం వహించే స్థాయికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. 2017–18 రాష్ట్ర బడ్జెట్‌ ఆశించిన ఫలితాలు రాబట్టేందుకు వీలుగా ఉండాలన్నారు. మరో మూడు రోజుల్లోగా శాఖల వారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. జీఎస్టీతో రానున్న రోజుల్లో ఆదాయం పెరుగుతుందని, స్నేహపూరిత వ్యాపారానికి అనువుగా ఉంటుందన్నారు.

  ఈవెంట్స్‌ నిర్వహణ ద్వారా రాష్ట్ర ఖ్యాతి పెంచుతున్నాం..
  మారుమూల ప్రాంతాలకు రహదారులు వేసే ప్రాజెక్టు కింద నిధులను పెద్ద ఎత్తున పొందేందుకు అవసరమైతే ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం పోలీసు, రహదారుల శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత, రెవెన్యూ లోటు నిధులు, రైల్వే జోన్‌ కేంద్రం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రానికి బ్రాండింగ్‌ తీసుకురావడం కోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని, ఈవెంట్స్‌ నిర్వహణ ద్వారా ఖ్యాతి పెరిగేలా చేస్తున్నామన్నారు. గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ఇన్‌ గవర్నెన్స్‌ పేరిట ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. కోర్‌ డ్యా‹ష్‌ బోర్డు రెండో వెర్షన్‌ తీసుకురావడంతో పాటు ఆదాయ, వ్యయాల వివరాలను ఉంచుతామన్నారు.

  గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ‘నరేగా’
  గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘నరేగా’ను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు–ప్రగతిపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని ఎంత మేర సద్వినియోగం చేసుకుంటే అంతమేర గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయవచ్చన్నారు. పంట కుంటల తవ్వకం 2.30 లక్షలు మాత్రమే పూర్తయిందని, మిగిలిన 1.70 లక్షల కుంటలను పూర్తి చేయాలని సూచించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నరేగా నిధులు రూ. 4,430 కోట్లు వ్యయం చేశారని, మిగిలిన రూ. 1,500 కోట్లు రాబోయే రోజుల్లో ఖర్చు చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు