ఊరటా... శిక్షా?

7 Feb, 2017 03:03 IST|Sakshi
ఊరటా... శిక్షా?

► ఆస్తుల కేసులో వారంలో తీర్పు
►  పోయెస్‌గార్డెన్ లో కలకలం
► శిక్షపడితే ఆపద్ధర్మ సీఎం ఎవరో?


మరో రెండు రోజుల్లో సీఎం కుర్చీ ఎక్కబోతున్న శశికళను  ఆదాయానికి మించిన ఆస్తుల కేసు భయపెడుతోంది. మరో వారం రోజుల్లో తీర్పు వెలువడనుంది. ఆస్తుల కేసు నుంచి శశికళకు ఊరట లభించేనా లేక శిక్ష పడేనా, శిక్షే ఖాయమైన నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరని రాష్ట్రంలో రసవత్తరమైన చర్చ సాగుతోంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్  ఆదాయానికి మించి రూ.66 కోట్ల ఆస్తులను కూడబెట్టారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్యస్వామి, డీఎంకే పెట్టిన కేసుపై చెన్నై, బెంగళూరు కోర్టుల్లో 18 ఏళ్లపాటూ విచారణ సాగింది. ఈ కేసుపై 2014 సెప్టెంబరు 27న తీర్పు చెప్పిన బెంగళూరు ప్రత్యే క కోర్టు జయ సహా నలుగురికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక జయలలిత రూ.100 కో ట్లు, మిగిలిన ముగ్గురు రూ.10 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు మేరకు జయ సహా నలుగురూ కొన్ని రోజులు బెంగళూరు  అగ్రహార జైలులో శిక్షను అనుభవించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేయగా, నలుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి కుమారస్వామి 2015 మే 11వ తేదీన తీర్పు చెప్పా రు.

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. తీర్పు ఇచ్చే సమయంలో జయ తదితరులు పాల్పడిన కొన్ని అక్రమాలను న్యాయమూర్తి విస్మరించారని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. జయ సహా నలుగురికి శిక్ష పడాల్సిన అంశాలను కర్ణాటక హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అన్బగళన్  తన వాదనను వినిపించారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేసి నిందితులకు శిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదోపవాదాలు ముగిసిన దశలో తేదీని ప్రకటించకుండా సుప్రీంకోర్టు గత ఏడాది జూన్  7వ తేదీన వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు చెప్పనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది.

శశికళ శిబిరంలో కలకలం
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శాసనసభా పక్ష నేతగా ఎన్నికై 24 గంటలు కాక మునుపే సుప్రీంకోర్టు తీర్పు గంట కొట్టడం కలకలం రేపింది. శశికళ నేడో రేపో గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అలాగే ఈ నెల 9వ తేదీన సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తీర్పు వెలువడుతున్న పరిస్థితులు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అవరోధం అవుతుందేమోనని అన్నాడీఎంకేలో భయాందోళనలు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ నెల 13వ తేదీన తీర్పు వెలువడాలి. అంటే శశికళ సీఎం అయిన నాలుగో రోజునే తీర్పు వస్తుంది. అనుకూలమైతే ఇబ్బందే లేదు, ప్రతికూలమైతే జైలు కెళ్లక తప్పదు. ఈ పరిస్థితుల్లో పదవీ ప్రమాణం వాయిదా వేసుకుంటారనే అనుమానాలు నెలకొన్నాయి.

ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడం ఖాయమని అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎస్‌ కరుప్పయ్య వ్యాఖ్యానించారు. సీఎం హోదాలో శశికళ జైలు కెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆపద్ధర్మ సీఎంగా ఎవరిని నియమిస్తారని కూడా గార్డెన్ లో అప్పుడే చర్చ మొదలైంది. కొందరు పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్లు చెబుతున్నారు. శశికళ మనస్తత్వాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నీర్‌సెల్వంకు అవకాశం ఇవ్వనున్నట్టు అంచనా వేస్తున్నారు. వీరెవరూ కాదు శశికళ తన భర్త నటరాజన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు