ఇక కాళ్ల బేరమే!

1 Dec, 2023 02:38 IST|Sakshi

తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు బాబు ఝలక్‌ 

ఏపీలో పవన్‌ ఎక్కువ సీట్లు అడగకుండా కట్టడి

రాజకీయ అపరిపక్వతతో అవకాశాన్ని జారవిడుచుకున్నామంటున్న జనసేన నేతలు

సాక్షి, అమరావతి: కరివేపాకు రాజకీయాల్లో ఆరితేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. పొత్తుల కోసం అర్రులు చాస్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గట్టి షాకిచ్చారు. ఏపీలో జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేసే అవకాశం లేకుండా తెలంగాణ ఎన్నికలను చంద్రబాబు వినియోగించుకున్నారు. తెలంగాణలో జనసేన ఎక్కడా గెలవకుండా, వీలైతే డిపాజిట్లు కూడా రాకుండా చంద్రబాబు తన ఎత్తుగడ అమలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒకపక్క బీజేపీతో అంటకాగుతూనే టీడీపీతో కలసి పోటీ చేస్తానంటూ రాజమహేంద్రవరం జైలు వద్ద పవన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అక్కడ ఎన్నికలకు దూరంగా ఉంటూ అస్త్ర సన్యాసం చేసిన టీడీపీ లోపాయికారీగా కాంగ్రెస్‌కు సహకారం అందించిన విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు స్నేహహస్తం సాచిన టీడీపీ శ్రేణులు బీజేపీ–జనసేన కూటమికి దూరంగా నిలిచేలా చంద్రబాబు పావులు కదిపారు.  

60 సీట్లు అడుగుదామని.. 
చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టై జైలుకు వెళ్లినప్పుడు పవన్‌ తన రాజకీయ అపరిపక్వతతో సీట్ల కోసం గట్టిగా డిమాండ్‌ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నట్లు జనసేన కార్యకర్తలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు కనీసం 60 సీట్లకు తగ్గకుండా ఇవ్వాల్సిందిగా పవన్‌ డిమాండ్‌ చేస్తారని భావించారు. అయితే తెలంగాణ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనకు అతి స్వల్ప సంఖ్యలో 15–20 సీట్లను మాత్రమే కేటాయించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

తెలంగాణలో జనసేన పోటీ చేసిన స్థానాల్లో ఆ పార్టీ ఓట్ల శాతాన్ని కట్టడి చేయడం ద్వారా పవన్‌ కాళ్ల బేరానికి వచ్చేలా పావులు కదిపినట్లు చర్చ సాగుతోంది. సమన్వయ కమిటీ సమావేశాల్లో టీడీపీ నేతలు తమను చులకనగా చూస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సీట్ల సంఖ్య ఖరారు కాకుండానే తమ అధినేత పొత్తుల గురించి తొందరపడి మాట్లాడారని పేర్కొంటున్నారు.  

నాడు బీజేపీకి వెన్నుపోటు 
2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇదే తరహా ఎత్తుగడ అమలు చేసిన విష­యాన్ని జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు. నాడు బీజేపీకి 15 అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీ స్థానా­లను కేటాయిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. తరు­వాత 11 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పరిమితం చేశారు. చివరకు బీజేపీ అభ్యర్ధులు నామినేషన్లు వేసిన స్థానాల్లో మూడు చోట్ల తమ పార్టీ అభ్యర్ధు­లను నిలబెట్టి స్నేహ­పూర్వకంగా పోటీ చేద్దామంటూ వెన్నుపోటు రాజకీయాలకు తెర తీశారు.
 

మరిన్ని వార్తలు