సీఎం కొడుకు అయినంతమాత్రాన....

14 Apr, 2016 10:32 IST|Sakshi
సీఎం కొడుకు అయినంతమాత్రాన....

సీఎం సిద్ధు కుమారుడికి ల్యాబ్‌భాగ్య!
సీఎం కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న సంస్థకు వైద్య సేవల కాంట్రాక్టు ఇచ్చిన సర్కార్
అధికార కాంగ్రెస్ పార్టీ ఆశ్రీత పక్షపాతానికి పాల్పడిందని ఆరోపణలు
ఇందులో ఎలాంటి అక్రమాలు లేవు: సీఎం
 
బెంగళూరు:  అధికార కాంగ్రెస్ పార్టీ ఆశ్రీత పక్షపాతానికి పాల్పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ కంపెనీకి వైద్యసేవలు అందించే కాంట్రాక్టులు కట్టబెట్టిందని తెలుస్తోంది. అయితే తమ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్కువ ధరకు రోగనిర్ధరణ పరీక్షలు చేయడం, ఫలితాలను వైద్యులకు అందించే పనులను ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది.

అందులో భాగంగా సేవలు అందించడానికి ముందుకు వచ్చే ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రయోగశాలలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా అందజేయనున్నారు.  ప్రయోగశాలకు అవసరమైన వస్తువులన్నింటినీ సదరు ప్రైవేటు సంస్థ సమకూర్చనుంది.  

అందులోని ఉద్యోగులకు కూడా సదరు సంస్థనే జీతభత్యాలు అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రుల్లోని  రోగనిర్ధరణ పరీక్షల రుసుములతో పోల్చినా ఈ సంస్థ 20 శాతం తక్కువగా రోగుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలతో ప్రభుత్వం పిలిచిన టెండర్‌ను మాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ పైలెట్ ప్రతిపాదికన బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి, అదే ఆవరణంలో ఉన్న వాణివిలాస్ ఆస్పత్రిలో అత్యాధునిక లాబొరేటరీ, డయాక్నొస్టిక్ కేంద్రాలను మరో పదిరోజుల్లో మాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్ సంస్థ రోగులకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

నిబంధనలకు విరుద్ధంగా!
మాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్ సంస్థ అందజేసే సేవలు, ఈమేరకు ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం తదితర విషయాలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వ అధికారిక ఫేస్‌బుక్‌పేజీలో ఈనెల 7న వెల్లడించింది. అయితే ఈ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లుగా డాక్టర్ సీ.ఎం రాజేష్‌గౌడతోపాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిన్నకుమారుడైన డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్యలు ఉన్నారు.

ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యులతో పాటు వారి సంబంధీకులు ఎవరూ ప్రభుత్వ ఆసుపత్రులే కాక ఏ ఇతర ప్రభుత్వ సంస్థలో సైతం ధనార్జన చేసే విధమైన ప్రాజెక్టులను, కాంట్రాక్టులను పొందకూడదు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న ఓ సంస్థ ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసే కాంట్రాక్టు దక్కించుకోవడం వెనక ఆశ్రీత పక్షపాతం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
సీఎం కొడుకు అయినంతమాత్రాన వ్యాపారం చేయకూడదా:
 తమ సంస్థ 2009లోనే రిజిస్ట్రర్ అయ్యింది. మాతో పాటు మరో రెండు సంస్థలు కూడా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. మేము అందరి కంటే తక్కువకు కోట్‌చేయడం వల్ల టెండర్ దక్కింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడిని అన్న ఒక్క కారణంతో నేను వ్యాపారం చేయకూడదా? ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించకూడదా? ఎక్కువ మంది రోగులు తమ సంస్థ సేవలు వినియోగించుకుంటారు కాబట్టి మేము తక్కువ ఫీజులు వసూలు చేసినా లాభసాటిగా ఉంటుంది. అయినా ఇన్ని అరోపణలు వచ్చిన తర్వాత నేను డైరెక్టర్ స్థానం నుంచి తప్పుకోనున్న విషయం ఆలోచిస్తున్నా.
 -యతీంద్ర సిద్ధరామయ్య

 

ఎటువంటి అక్రమాలు జరగలేదు...
 ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు లోబడే టెండర్ ప్రక్రియలో మిగిలిన అన్ని సంస్థలతో పాటు మాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్ పాల్గొంది. అందరికంటే తక్కువకు బిడ్ దాఖలు చేయడంతో ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం  కుదుర్చుకుంది. అసలు బిడ్‌దాఖలు చేసే సమయంలో నా కుమారుడు నాతో మాట్లాడనే లేదు. అందువల్ల అక్రమాలకు చోటు లేదు.
 -సీఎం సిద్ధరామయ్య
 
 ప్రభుత్వ ఆస్పత్రుల కంటే తక్కువ ఫీజు!:
 మాట్రిక్ ఇమాజినేషన్ సొల్యూషన్ సంస్థ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ  ఆస్పత్రితో పోల్చినా దాదాపు 20 శాతం తక్కువ ఫీజు ఉంటుంది. ఆ వివరాలన్నీ ప్రజలకు తెలిసేలా బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో  థైరాయిడ్ పరీక్ష రూ.600 నుంచి రూ.1000 వరకూ ఉంటుంది. విక్టోరియా ఆసుపత్రిలో రూ.300 వసూలు చేస్తున్నారు. అయితే మాట్రిక్స్ ఇమాజినేషన్ సంస్థ ఈ పరీక్షను రూ.220 అందిస్తుంది. దీని వల్ల ప్రజలకు లాభమే కదా? అంతేకాకుండా ఈసంస్థ రోజుకు 24 గంటలూ సిటీ స్కాన్ వంటి  సేవలు అందిస్తుంది. ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నంత మాత్రానా టెండర్ ప్రక్రియను రద్దు చేయడం సరికాదు.
 -వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ప్రకాశ్ పాటిల్

 

మరిన్ని వార్తలు