శభాష్‌ కలెక్టర్‌..!

23 Dec, 2019 13:25 IST|Sakshi
ప్రమాద ఘటనను చూసి కారు ఆపినకలెక్టర్‌ విజయ్‌అమృత కులంగా (ఇన్‌సెట్లో) క్షతగాత్రుడిని కలెక్టరు వాహనంలోకిఎక్కిస్తున్న దృశ్యం

కారులో వెళ్తుండగా ప్రమాద ఘటనపై స్పందించిన కలెక్టరు విజయ్‌అమృత కులంగా తన వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, వైద్యసేవలు అందించిన వైనంకలెక్టరు తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

బరంపురం: అధికారులు ఎప్పుడూ తమ అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంటారు. సామాన్యుడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన సందర్భాల్లో కూడా తమ పనుల నిమిత్తం వెళ్లిపోయిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. చాలా తక్కువ మంది మాత్రమే తామెంత అర్జంట్‌ పనిలో ఉన్నా ఎదురుగా ఉన్న మనిషి పడుతున్న కష్టం చూసి కారు ఆపుతారు. వెంటనే తమకు తోచిన సహాయం చేసి మానవత్వం చాటుకుంటారు. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే గంజాం జిల్లాలోని సరగడా సమితిలో ఆదివారం చోటుచేసుకుంది. అదే దారిలో ఓ కారులో ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తున్న కలెక్టరు విజయ్‌అమృత కులంగా అక్కడ జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను చూసి కారు ఆపి, దిగారు. అనంతరం జరిగిన సంఘటనపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. కారు–బైక్‌ ఢీకొన్న ఘటనలో శివరామ్‌ పాత్రో తీవ్రగాయాలపాలవ్వగా, అతడిని ఆస్పత్రికి తరలించేందుకు రెండు గంటల నుంచి అంబులెన్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయినా అంబులెన్స్‌ రాలేదు.. ఈ క్రమంలో క్షతగాత్రుడి పరిస్థితి రానురాను తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో ఇదే విషయం పట్ల స్పందించిన కలెక్టరు తన ప్రభుత్వ వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత హింజిలికాట్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందజేసేలా చేశారు. ఇదే విషయంపై కలెక్టరు తీరు పట్ల అక్కడి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహోన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తే సమాజం ఆదర్శంగా తీసుకుంటుందని అంటున్నారు.

వివరాలిలా ఉన్నాయి..
ఛత్రపూర్‌ నుంచి కలెక్టర్‌ విజయ్‌అమృత కులంగా సరగడా సమితిలోని ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమానికి కారులో వెళ్తున్నారు. అదే సమయంలో సరగడా దగ్గర మారుతి గ్రామం జంక్షన్‌ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాద ఘటనలో శివరామ్‌ పాత్రో తీవ్రగాయాలతో పడి ఉన్నాడు.ఇదే సంఘటన చూసిన కలెక్టరు కారును ఆపి, క్షతగాత్రుడిని తన కారులో ఎక్కించుకుని, హింజిలికాట్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుడికి వైద్యసేవలు అందజేశారు.

మరిన్ని వార్తలు