మండలిలో ‘వక్ఫ్’ రగడ

29 Mar, 2016 02:34 IST|Sakshi

బెంగళూరు: వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని దాదాపు రూ. 15 లక్షల కోట్ల విలువ చేసే 57వేల ఎకరాల భూములకు సంబంధించిన అవకతవకలపై శాసనమండలిలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అవకతవకలపై అన్వర్ మానప్పాడి నేతృత్వంలోని సమితి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాలంటూ డిమాండ్ చేశాయి. ఇదే సందర్భంలో మండలిలో నివేదికను ప్రవేశపెట్టే వరకు సభను సాగనివ్వమంటూ వెల్‌లోకి దూసుకెళ్లి తమ నిరసనను తెలియజేశాయి. సోమవారం ఉదయం శాసనమండలి కార్యకలాపాలు ప్రారంభం కాగానే  విపక్షనేత కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ... వక్ఫ్ ఆస్తులకు సంబంధించి అన్వర్ మానప్పాడి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా చైర్మన్ ఆదేశించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ నివేదికను మండలిలో ప్రవేశపెట్టలేదని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని 57వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, తద్వారా రూ.15 లక్షల కోట్ల మేరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ భూములను కబ్జా చేసిన వారిని రక్షించుకునేందుకు ప్రభుత్వం పాకులాడుతోందని విమర్శించారు. ఈ సందర్భంలో శాసనమండలిలో అధికార పక్ష నేత ఎస్.ఆర్.పాటిల్ కలగజేసుకొని...‘ప్రజలు కడుతున్న పన్నులతో సభా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి సభలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, కరువు సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవేవీ ప్రతిపక్షానికి పట్టడం లేదు. కేవలం రాజకీయాల కోసమే సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారు’ అని మండిపడ్డారు.


ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య చాలా సేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర మాట్లాడుతూ...‘వందేళ్ల చరిత్ర ఈ సభకు ఉంది, సభ సరిగ్గా లేనపుడు ఇక చర్చలు జరపడం కూడా అనవసరం. ముందు సభా కార్యకలాపాలు సాగనివ్వండి. మీరు ఇచ్చిన రూలింగ్‌పై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం’ అని కోరారు. అయితే జయచంద్ర సమాధానంతో ప్రతిపక్షం శాంతించలేదు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప మాట్లాడుతూ....‘ఇప్పటికే మూడు సార్లు ఈ విషయంపై రూలింగ్ ఇచ్చాం, నివేదికను మీరు మండలిలో ప్రవేశపెడతారో లేదో స్పష్టంగా చెప్పి, నివేదికను ప్రవేశపెడతామని హామీ ఇస్తేనే మా పోరాటాన్ని నిలిపివేస్తాం. లేదంటే మా పోరాటం కొనసాగుతుంది’ అని హెచ్చరించారు. 

 

మరిన్ని వార్తలు