బెంగళూరు-పుణే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

7 May, 2015 23:59 IST|Sakshi
బెంగళూరు-పుణే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

- నిలిచి ఉన్న మినీ బస్‌ను ఢీకొన్న లగ్జరీ బస్సు
- కొల్హాపూర్ జిల్లా వటార్ గ్రామ సమీపంలో ఘటన
- ముగ్గురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు
సాక్షి, ముంబై:
బెంగళూరు-పుణే జాతీయ రహదారిపై కోల్హపూర్ జిల్లా వటార్ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిచి ఉన్న బస్సును మరో బస్సు వెనుక నుంచి ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిసింది. వివరాలు.. కర్నాటకలోని ధారవడ్ నుంచి ఓ పెళ్లి బృందం మినీ బస్సులో పుణేకి బయలుదేరింది.

తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో టీ తాగడానికి వటార్ గ్రామం వద్ద డ్రైవర్ బస్సును నిలిపాడు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా వేగంగా దూసుకొచ్చిన లగ్జరీ బస్సు మినీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. భారీ శబ్దంతో నిలిచి ఉన్న మినీ బస్సు దూరంగా రోడ్డు కిందికి పడిపోయింది. స్థానిక ప్రజలు, పోలీసులు  క్షతగాత్రులను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఆశాభి హండగల్ (70), షాహీనా హండగల్ (15), షహీదా హండగల్ (20) మృతి చెందారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వడ్‌గావ్ పోలీసులు లగ్జరీ బస్సు డ్రైవర్ కోంబి నాయిక్ (38)ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చే స్తున్నారు.

మరిన్ని వార్తలు