పుస్తకాలివ్వకుండానే ‘పరీక్షలు’ | Sakshi
Sakshi News home page

పుస్తకాలివ్వకుండానే ‘పరీక్షలు’

Published Thu, May 7 2015 11:56 PM

Exams without distribution of textbooks

విద్యార్థుల జీవితాలతో ఓపెన్ స్కూల్ సొసైటీ చెలగాటం
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక విద్య సొసైటీ యాజమాన్యం విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. ఈ ఏడాది ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకుండానే పరీక్షలు నిర్వహిస్తోంది. ఓపెన్ స్కూల్‌లో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి దాదాపు 45 వేల మం ది విద్యార్థులకు ప్రవేశాలు పొందారు.

సాధారణంగా ప్రవేశం పొందిన విద్యార్థికి వెంటనే పాఠ్య పుస్తకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఈ ఏడా ది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన దాఖలాల్లేవు. కేవలం తెలుగు, ఆంగ్లం, ఉర్దూ పుస్తకాలు మాత్రమే అందించి మమ అనిపించిన అధికారులు.. గణితం సామాన్య, సాంఘిక పుస్తకాల పంపిణీపై చేతులెత్తేశారు.

ముద్రణ కాలేదని..
 రాష్ట్ర విభజనతో ఓపెన్ స్కూల్ సొసైటీ గతేడాది అక్టోబర్ చివర్లో విడిపోయి తెలంగాణ సొసైటీ ఏర్పాటైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయాలి. కానీ విభజన ప్రక్రియలో జరిగిన జాప్యంతో పాఠ్యపుస్తకాల ముద్రణ జరగలేదని, అందుబాటులో ఉన్న లాంగ్వేజెస్ కేటగిరీ పుస్తకాలు అందించామని, పాఠ్యాంశంలో మార్పులు జరగనందున గతేడాది మిగులు పుస్తకాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు రంగారెడ్డి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నారాయణ ‘సాక్షి’తో పేర్కొన్నారు.

నేటితో ముగియనున్న పరీక్షలు
 ఓపెన్ టెన్త్‌కు సంబంధించి ఈ నెల నాలుగో తేదీన పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే పరీక్షలు శుక్రవారంతో ముగియనున్నాయి. విద్యార్థులకు ఈ ఏడాది ఆప్షనల్ పుస్తకాలు అందించడంలో సర్కారు విఫలమైంది. దీంతో ఆయా విద్యార్థులు పుస్తకాల ముఖం చూడకుండానే పరీక్షలకు హాజరుకావడం గమనార్హం.

Advertisement
Advertisement