సుప్రీం ఆదేశాలు పాటించకుండా..

26 Aug, 2016 12:13 IST|Sakshi
సుప్రీం ఆదేశాలు పాటించకుండా..
ముంబై: దహీ హండీ (ఉట్టి) కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్‌ ఎత్తు పెంచడానికి అనుమతివ్వబోమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కృష్ణభక్తులు పట్టించుకోలేదు. కృష్ణాష్టమి సందర్భంగా 20 అడుగులకు మించి పిరమిడ్లను నిర్మించి గురువారం ముంబైలోని పలుచోట్ల ఉట్టి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు చిన్నారులు సైతం ఉన్నారు. ఉల్లాస్ నగర్లో నిర్వహించిన ఉత్సవాల్లో తీవ్రంగా గాయపడిన 12 ఏళ్ల సుజల్, కాండివ్లి ప్రాంతంలో ఉత్సవాల్లో పాల్గొన్న 9 ఏళ్ల ధీరజ్ ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాలకోసం పోరాడుతున్నారు.

దహీ హండీ సందర్భంగా ముంబై వ్యాప్తంగా 159 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వీరిలో 115 మంది ప్రధమ చికిత్స అనంతరం కోలుకోగా.. మిగిలినవారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గత సంవత్సరం ఇదే ఉత్సవాల సందర్భంగా 364 మంది గాయపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సారి గాయపడిన వారి సంఖ్య తగ్గినా.. సుప్రీంకోర్టు నిబంధనలు మాత్రం పూర్తిగా అమలు కాలేదు. దహీ హండీలో ఉత్సవాల్లో 18 ఏళ్లు నిండని వారు పాల్గొనరాదని, మానవ పిరమిడ్ ఎత్తు 20 అడుగులకు మించరాదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.
 
మరిన్ని వార్తలు