మల్లగుల్లాలు

23 Oct, 2016 03:24 IST|Sakshi
మల్లగుల్లాలు

సాక్షి, చెన్నై:  ఉప ఎన్నికల బరిలో అభ్యర్థుల్ని నిలబెడదామా, వద్దా? అని మక్కల్ ఇయక్కం ఓ వైపు, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకేలు మరో వైపు వేర్వేరుగా మల్లగుల్లాలు పడుతున్నాయి. మిత్రుల మధ్య భిన్న వాదనల నేపథ్యంలో మక్కల్ ఇయక్కం కన్వీనర్ ఎండీఎంకే నేత వైగో పార్టీ నేతల అభిప్రాయాల సేకరణలో పడ్డారు. చివరకు ఏకాభిప్రాయం కుదిరేలా చేశారు. ఇక, తాను సోమవారం నిర్ణయాన్ని ప్రకటిస్తాన ని తమిళ మానిల కాం గ్రెస్ నేత వాసన్ వ్యాఖ్యానించారు. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ మాత్రం మౌనంగానే ఉన్నా రు. రాష్ర్టంలో వాయిదా పడ్డ తం జావూరు, అరవకురిచ్చిలతో పాటు శీనివేల్ మరణంతో ఖాళీగా ఉన్న తిరుప్పర గుండ్రం స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలి సిందే.
 
  ఇప్పటికే  అన్నాడీఎంకే,  డీఎంకేలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే, అరవకురిచ్చి అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ల మోత మోగుతున్న దృష్ట్యా, ఉత్కంఠ తప్పడం లేదు. సెంథిల్ బాలాజీని ఢీకొట్టేందుకు రేసులో ఉన్న డీఎంకే అభ్యర్థి కేసీ పళనిస్వామికి వ్యతిరేకంగా కూడా కోర్టుల్ని ఆశ్రయించేందుకు పలువురు సిద్ధం అవుతుండడం గమనార్హం. ఇక, మిగిలిన అభ్యర్థులు తమకు ఎలాంటి చిక్కులు ఉండబోదన్నట్టుగా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక, తిరుప్పరగుండ్రం డీఎంకే అభ్యర్థి శరవణన్‌కు ఆ పార్టీ బహిష్కృత నేత అళగిరి రూపంలో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
  ఇందుకు కారణం మరో అభ్యర్థి దొరకలేదా..? అని డీఎంకేను అవహేళన చేస్తూ అళగిరి వారసుడు దయానిధి అళగిరి ట్విట్టర్‌లో స్పందించి ఉండడం ఆలోచించ దగ్గ విషయమే. అన్నాడీఎంకే, డీఎంకేలు రేసులో దిగడంతో, ఇక తామూ దిగుదామా వద్దా అన్న యోచనలో గత ఎన్నికల్లో ఆరుగురిగా ముందుకు సాగి, ఇప్పుడు నలుగురికి పరిమితమైన మక్కల్ ఇయక్కం మల్లగుల్లాలు పడుతున్నది.
 
 భిన్న వాదనలు : అసెంబ్లీ ఎన్నికల్లో ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లు ఒకే వేదికగా ప్రజా సంక్షేమ కూటమి అంటూ  ప్రజల్లోకి వెళ్లి డిపాజిట్లనే కాదు, ఓటు బ్యాంక్‌నూ కోల్పోయిన విషయం తెలిసిందే. ఫలితాల తారుమారుతో ఆరుగురిలో, చివరకు నలుగురుగా మిగిలారు. ప్రస్తుతం మక్కల్ ఇయక్కంగా ముందుకు సాగుతున్న ఆ నలుగురిలో ఉప ఎన్నికలు విభేదాల్ని సృష్టించేనా అన్న ప్రశ్నను తెర మీదకు తెచ్చింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు ఆ ఇయక్కంలో సాగుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉప రేసులో తమ అభ్యర్థులను బరిలో దించాలా, వద్దా అన్న విషయంలో ఆ ఇయక్కం నేతల మధ్య భిన్న వాదనలు బయలు దేరాయి. సీపీఎం, సీపీఐ ఓ వాదన విన్పిస్తుంటే, వీసీకే, ఎండీఎంకేలు వేర్వేరుగా తమ తమ వాదనలు విన్పించే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి.
 
  అయితే, ఈ వాదనలు ఏమిటో అన్నది గోప్యంగా సాగుతున్నా, రేసులో తాము ఉండాలా, వద్దా అని తేల్చుకునేందుకు ఆ కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో సిద్ధమయ్యారు. శనివారం ఎగ్మూర్‌లోని  ఎండీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ వర్గాల అభిప్రాయాల్ని సేకరించారు. అయితే, ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్న సూచనను పలువురు ఇచ్చినా, తుది నిర్ణయం ఇయక్కం నేతల ఏకాభిప్రాయంతో సాధ్యం అన్న విషయాన్ని పరిగణించి ముందుకు సాగే పనిలో పడ్డారు. చివరకు ఆ నలుగురూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉప ఎన్నిక ప్రజా స్వామ్యబద్ధంగా జరిగే అవకాశాలు లేని దృష్ట్యా, ఇక, ఆ ఎన్నికలకు తాము దూరం అని ప్రకటించేశారు.
 
 వాసన్, కెప్టెన్ ఎటో: అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురం అంటూ పయనం సాగించి, ఘోర పరాభావంతో ఇక తమ దారి తమదే అని బయటకు వచ్చిన నేతల్లో డీఎండీకే అధినేత విజయకాంత్ ఒకరు. మరొకరు తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్. స్థానిక ఎన్నికల నినాదంతో డీఎంకేకు దగ్గరయ్యేందుకు జీకే వాసన్ తీవ్రంగానే ప్రయత్నించినా, అందుకు తగ్గ మార్గం లభించలేదు. ఇక, ఉప ఎన్నికల ద్వారా సత్తా చాటుకుందామా, వద్దా అన్న డైలమాలో ఉన్నారు. తమ ప్రతినిధి ఒక్కరైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని కాంక్షిస్తున్న జీకే వాసన్, ఉప ఎన్నికల ద్వారా రేసులో తానే స్వయంగా దిగితే ఎలా ఉంటుందో అన్న పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఏదేని తిరకాసు ఎదురైన పక్షంలో రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం తప్పదన్న విషయాన్ని పరిగణించి, ఆచీతూచీ అడుగులు వేయడానికి నిర్ణయించారు.
 
  ఉప రేసులో ఉండాలా వద్దా అన్నది సోమవారానికి తేల్చేస్తానని మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరబాటుకు పాతాళంలోకి నెట్టబడ్డ విజయకాంత్, ఇంకా తన మౌనాన్ని వీడనట్టుంది. ఉప ఎన్నికల రేసులో ఉండాలా, వద్దా అన్న సందిగ్ధంలో విజయకాంత్ ఉన్నా, ఆ కేడర్ మాత్రం కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయకాంత్‌కు సొంత జిల్లా మదురై అన్న విషయం తెలిసిందే.
 
 ఆ జిల్లా పరిధిలో ఉన్న  తిరుప్పరగుండ్రం  నియోజకవర్గంలో ఆయనకు బలం కూడా ఉందని, ఈ దృష్ట్యా, ఆయన ఈ ఉపఎన్నికల్ని సద్వినియోగం చేసుకుని రేసులో దిగాలని కాంక్షించే కేడర్ ఎక్కువే. 2006లో తానొక్కడినే అసెంబ్లీ మెట్లు ఎక్కి, తదుపరి ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన విజయకాంత్, ఈ ఎన్నికల ద్వారా మళ్లీ పార్టీ తరఫున తానొక్కడే అడుగు పెట్టి, మళ్లీ అందలం ఎక్కే రీతిలో కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధం కావాలని సూచించే నాయకులు డీఎండీకేలో ఉండడం గమనార్హం. అయితే, కెప్టెన్ తుది నిర్ణయం ఏమిటో అన్నది ఆ పార్టీ వర్గాలకే అంతు చిక్కదు.
 

>
మరిన్ని వార్తలు