కన్నెర్ర!

24 Apr, 2016 04:01 IST|Sakshi
కన్నెర్ర!

* ఇరకాటంలో కెప్టెన్
* వ్యతిరేకంగా రజనీ సేన
* 104 చోట్ల అభ్యర్థుల ఓటమి లక్ష్యం

సాక్షి, చెన్నై: తమ కథానాయకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పని డీఎండీకే అధినేత విజయకాంత్‌పై రజనీ సేన కన్నెర్ర చేశారు. డీఎండీకే అభ్యర్థులు బరిలో ఉన్న 104 నియోజక వర్గాల్లో వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అశేషాభిమాన లోకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ తలైవాను రాజకీయాల్లోకి ఆహ్వానించేందుకు తీవ్రంగా కుస్తీలు పడుతూ వస్తున్నారు. ఎక్కడ అభిమానులకు, రాజకీయాలకు చిక్కకుండా ,వివాదాలకు దూరంగా రజనీకాంత్ ముందుకు సాగుతున్నారు.

ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో రజనీని ఉద్దేశించి విజయకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీశాయి. రజనీ కాంత్ పేరిట అభిమాన సంఘాల్ని ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న వాళ్లంతా, తమ దృష్టిని విజయకాంత్ మీద మరల్చారు. గత ఆదివారం విజయకాంత్ తీరుకు నిరసనగా రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలకు దిగారు. విజయకాంత్ తమ కథానాయకుడికి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. క్షమాపణలు చెప్పని పక్షంలో తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని అభిమాన సంఘాలు హెచ్చరించాయి. అయితే, విజయకాంత్ ఏ మాత్రం తగ్గలేదు. తన బాటలోనే ముందుకు సాగుతుండటంతో, ఇక, ఆయన్ను, డీఎండీకేను ఇరకాటంలో పెట్టేందుకు రజనీ సేన సిద్ధం అయింది.

రాష్ట్రంలో 104 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న డీఎండీకే అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఆ అభ్యర్థుల ఓటమి లక్ష్యంగా రజనీ అభిమానులు ఏకమై సూపర్ స్టార్ మక్కల్ కళగంగా ఏర్పడి ముందుకు సాగేందుకు నిర్ణయించారు. తిరుప్పూర్ వేదికగా శనివారం నిరసన  కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక, తమ అభిమానులందరూ 104 నియోజకవర్గాల్లోనూ డీఎండీకే అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తారని, వారికి వ్యతిరేకంగా ఇక నిరసనలు ఉధృతం కానున్నట్టుగా ఆ కళగం ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ మురుగన్ పేర్కొన్నారు.

మీడియాతో మురుగన్ మాట్లాడుతూ, కనీసం తమ కథానాయకుడికి క్షమాపణలు చెప్పడానికి కూడా విజయకాంత్‌ముందుకు రాక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన తీరుతో ఆ పార్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్టాల్ని, కష్టాలను ఇక చవి చూడబోతున్నారని, వారికి వ్యతిరేకంగా తమ ప్రచార పయనం సాగబోతోందన్నారు.

మరిన్ని వార్తలు