వైద్యులపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు !

12 Dec, 2016 15:10 IST|Sakshi
వైద్యులపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు !
- బేడీలు వేసి పనిచేయించాలేమో
- శాసనసభలో వైద్యులపై మంత్రి రమేష్ కుమార్ ఆక్రోశం
 
బెంగళూరు:  గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా లేని వైద్యులకు బేడీలు వేసి.. పనిచేయాలని నిర్భందించాలేమోనని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి రమేష్‌కుమార్‌ శాసనసభలో ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఉమేష్‌కత్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాష్ట్రంలో రాష్ట్రంలో 53 వైద్య విద్యా కళాశాలలు ఉండగా అందులో 11 ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయన్నారు. వైద్య విద్య కళాశాలల నుంచి ప్రతి ఏడాది ఐదు వేల మంది ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేస్తున్నారని, అదేవిధంగా సుమారు 2,500 మంది పీజీ వైద్యను పూర్తి చేస్తున్నారన్నారు. అయితే వీరిలో చాలా మంది రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధపడటం లేదన్నారు. పేదలు కడుతున్న పన్నులతో తాము చదువుకున్నామన్న జ్ఞానం ఉండటం లేదన్నారు. అందువల్లే పేదలకు సేవ చేయడానికి ముందుకు రావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
బహుశా వారికి బేడీలు వేసి గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని కట్టుదిట్టమైన చట్టాలు చేయాలనేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాజణ్ణ కలుగజేసుకుని ’మీరు బాధపడకండి. కఠిన చట్టాలు చేసి వారి చేత పనిచేయించుకుందాం.’ అని పేర్కొన్నారు. దీంతో తేరుకున్న రమేష్‌కుమార్‌ సాధారణ వైద్యులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో గైనకాలజిస్ట్‌ తదితర నిపుణులైన వైద్యుల కొరత చాలా ఉన్న మాట వాస్తవమేనన్నారు. సమస్య పరిష్కారం కోసం వైద్య విద్యలో పీజీ డిప్లొమో కోర్సును ప్రారంభించనున్నామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ముందుకు వచ్చే వారికి రోజు లేదా గంటల ప్రతిపాదికన కూడా వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రమేష్‌కుమార్‌ శాసనసభకు తెలిపారు.  అదేవిధంగా ప్రతి తాలూకా ఆసుపత్రుల్లో ఒక సైకాలజిస్ట్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఉభయ సభల్లో వివిధ ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ఇచ్చిన సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి... 
 
- ప్రస్తుతం వసతి పాఠశాల్లో ఖాళీగా ఉన్న 5,264 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హెచ్‌. ఆంజనేయ తెలియజేశారు.  
 
- బెంగళూరు నగరంలో 5420 హోర్డింగులు ఉండగా కొన్ని చోట్ల అనధికార అడ్వర్‌టైజ్‌మెంట్‌పోస్టర్లు ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఇందుకు సంబంధించిన వారి నుంచి రూ.326 కోట్లు అపరాద రుసుం వసూలు కావాల్సి ఉందని బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్‌ తెలిపారు.  
 
- బెంగళూరులో అక్రమంగా నివశిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న 48 మంది విదేశీయులను ఇప్పటికే అరెస్టు చేశామని హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌ తెలిపారు.  
 
- రాష్ట్రంలో 3.12 కోట్ల రేషన్ కార్డులు ఉండగా ఇప్పటి వరకూ 3.9 కోట్ల కార్డులకు ఆధార్‌ సంఖ్యను జతచేర్చామని పౌరసరఫరాల శాఖ మంత్రి యూ.టీ ఖాదర్‌ తెలిపారు. రేషన్ కార్డులకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అయితే ఆధార్‌ కార్డు జత చేయని రేషన్ కార్డులను ఇప్పటి వరకూ రద్దు చేయలేదన్నారు.   
 
మరిన్ని వార్తలు