బాబు నిప్పయితే.. తోక ముడిచారెందుకు?

29 Sep, 2023 02:38 IST|Sakshi

చర్చిస్తే వాస్తవాలు బయట పడతాయనే అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల పలాయనం 

అధికారంలోకి రావాలి.. దోచుకోవాలన్నదే టీడీపీ ఉద్దేశం 

భర్త క్రూరత్వాన్ని, స్వార్ధ రాజకీయాల్ని భువనేశ్వరి గుర్తు తెచ్చుకోవాలి 

టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపాటు

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అన్ని ఆధారాలతో దొరికేసిన చంద్రబాబు తాను నిప్పు అని చెప్పుకుంటూ బిల్డప్‌ ఇవ్వడం సిగ్గు చేటు అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మీ బాబు నిప్పు అయితే.. అసెంబ్లీలో చర్చకు తోక ముడిచారెందుకు’ అని టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీశారు. ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో రూ.371 కోట్లను షెల్‌ కంపెనీలకు విడుదల చేసిన చంద్రబాబు తిరిగి వాటిని తన ఖాతాలోకి ఎలా జమ చేసుకున్నాడనే వాస్తవాల్ని పత్రికల్లో చదివాం.

కానీ.. అసలు ఇందులో నిజాల్ని పూర్తిగా అందరికీ కళ్లకు కట్టినవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గొంటే వాస్తవాలు బయట పడతాయనే భయంతో సభ నుంచి పలాయనం చిత్తగించారు. టీడీపీ సభ్యులు ఎందుకు పారిపోవాల్సి వచి్చందో చెప్పాలి’ అని కోరారు. చంద్రబాబు స్కామ్‌లను అధికారులు బయటపెడితే అదేదో రాజకీయ కక్ష సాధింపు అనడం సరికాదన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే రూ.కోట్లు వెచి్చంచి లాయర్లను ఎందుకు పెట్టుకుంటారని నిలదీశారు.  

అసెంబ్లీ సాక్షిగా స్కామ్‌లను ఎండగట్టాం 
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అండ్‌ కో చేసిన స్కామ్‌లను ఎండగట్టామని గడికోట అన్నారు. అడ్డంగా బుక్కైన చంద్రబాబు, లోకేశ్‌ కుంభకోణాల ఆధారాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయన్నారు. అన్ని కుంభకోణాలకు  సూత్రధారులు, పాత్రధారులు తండ్రీ కొడుకులే అన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలని.. అందిన కాడికి దోచుకోవాలన్నదే టీడీపీ ఉద్దేశమని పేర్కొన్నారు.

పచ్చ మీడియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని.. ఎల్లో మీడియా చేస్తున్నది జర్నలిజమా? చంద్రబాబు ఇజమా? అని ప్రశ్నించారు. తన భర్త క్రూరత్వాన్ని, స్వార్థ రాజకీయాల్ని నారా భువనేశ్వరి గుర్తు తెచ్చుకోవాని కోరారు. అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ నేతలెవరూ ఆమెను అవమానించలేదని, నిజానిజాలేంటో ఆమె చంద్రబాబునే నిలదీయాలని పేర్కొన్నారు. ఒక మహిళగా భువనేశ్వరిని ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ గౌరవిస్తుందన్నారు.

టీడీపీ సభ్యుల తీరు జుగుప్సాకరం
అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగితే.. మొదటి రెండ్రోజుల్లో టీడీపీ సభ్యుల జుగుప్సాకరమైన తీరును చూసి ప్రజలు అసహ్యించుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చలో పాల్గొంటే అభాసు పాలవుతామనే భయంతో సమావేశాల మొదటి రోజు నుంచే గందరగోళం సృష్టించారన్నారు.

స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి.. కంప్యూటర్‌లను, ఇతర వస్తువుల్ని లాగిపడేశారని, పేపర్లు చించి స్పీకర్‌ మొహాన విసిరేశారని గుర్తు చేశారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, విజిల్స్‌తో సభలో గందరగోళం సృష్టించిన దృశ్యాలనూ ప్రజలంతా చూశారన్నారు. కేవలం ముగ్గుర్ని మాత్రమే సస్పెండ్‌ చేస్తే.. మిగిలిన సభ్యులు సమావేశాలకు హాజరుకాకుండా ఎందుకు బాయ్‌కాట్‌ చేయాల్సి వచ్చిందో సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు