సాయిబాబాను విడిచిపెట్టండి

15 May, 2014 22:30 IST|Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఆరోగ్యం బాగా లేనందున మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన విడుదల చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) అధ్యాపకులు కోరుతున్నారు. అసలు ఆయనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తూ డీయూ అధ్యాపకుల సంఘం (డూటా) బుధవారం ఆందోళన నిర్వహించింది. సాయిబాబా కుటుంబ సభ్యులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తనకు సరైన సదుపాయాలు కల్పించకుంటే నాగపూర్ జైలులోనే నిరాహార దీక్షకు దిగుతానని సాయిబాబా హెచ్చరించారు. ‘కనీసం వెలుతురు కూడా లేని చీకటిగదిలో వికలాంగుడ్ని ఎలా ఉంచుతారో అర్థం కావడం లేదు.
 
 నా భర్తను సస్పెండ్ చేసి క్వార్టర్ నుంచి మమ్మల్ని వెళ్లగొట్టాలని డీయూ యాజమాన్యం భావిస్తోంది’ అని సాయిబాబా బార్య వసంత మీడియా సమావేశంలో అన్నారు. పోలీసులకు ఆయన అన్ని విధాలా సహకరిస్తున్నారని, మొబైల్ నంబర్ మార్చిన విషయాన్ని కూడా ఆయన తెలియజేశారని వివరించారు. ఒక అధ్యాపకుణ్ని చీకటిగదిలో నిర్బంధించి హింసించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని డూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ విమర్శించారు. పోలీసుల అణచివేతపై పోరాడటానికి ‘డీయూ కమ్యూనిటీ’ పేరుతో ప్రత్యేక సంఘంగా ఏర్పడ్డామని, ఆయనకు బెయిల్ వచ్చేదాకా పోరాడుతామని ప్రకటించారు. పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అపహరించారని సినీ రూపకర్త సంజయ్ కక్ ఆరోపించారు. ఆపరేషన్ గ్రీన్ హంట్‌లో భాగంగానే పోలీసులు ఈ పనిచేశారని స్పష్టం చేశారు. సాయిబాబాకు జరుగుతున్న అన్యాయంపై డీయూ యాజమాన్యం కూడా స్పందించాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ సచార్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని నల్లమిల్లి గ్రామానికి చెందిన సాయిబాబాను ఈ నెల తొమ్మిదిన అరెస్టు చేశారు.
 
 పీయూసీఎల్ ఖండన
 మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సాయిబాబాను అరెస్టు చేయడాన్ని పౌరహక్కుల ప్రజాసంఘం (పీయూసీఎల్) గురువారం ఖం డించింది. ఆయనను అరెస్టు చేసిన విధానం అత్యంత క్రూరంగా ఉందని పీయూసీఎల్ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. ఆయన పోలీసులకు అన్ని విధాలా సహకరించారని స్పష్టం చేసింది. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసులో జోక్యం చేసుకొని గడ్చిరోలీ పోలీసులపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేసింది. తీవ్రవైకల్యంతో వీల్‌చెయిర్‌కు పరిమితమైన ఈ ప్రొఫెసర్ రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లిష్ సబ్జెక్టు బోధిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు