కన్నులపండువగా తెప్పోత్సవం..

12 Oct, 2016 06:46 IST|Sakshi
కన్నులపండువగా తెప్పోత్సవం..
విజయవాడ (వన్‌టౌన్‌) : త్రిశక్తి స్వరూపిణి.. త్రైలోక్య సంచారిణి.. అమ్మలగన్నయమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై స్వయంభువై భక్తులను అనుగ్రహిస్తున్న జగన్మాత కనకదుర్గమ్మ. విజయదశమి పర్వదినాన కృష్ణమ్మ ఒడిలో జలవిహారం కన్నులపండువగా జరిగింది. ఆ మహత్తర వేడుకను కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఏటా తండోపతండాలుగా తరలివచ్చారు. తెప్పోత్సవంగా పిలిచే ఈ హంస వాహనసేవ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. సర్వలోకాలను హింసిస్తున్న దుష్ట రాక్షస గణాలను దుర్గమ్మ వివిధ అవతారాల్లో సంహరించింది. అమ్మవారి విజయానికి సూచికగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకొంటారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాల్లో తొలుత గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లను హంసవాహనం అధిష్టింపజేస్తారు. తెప్పోత్సవంగా పేర్కొనే ఈ ఉత్సవంలో వేద పండితుల చతుర్వేద స్వస్తి, అర్చకుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా, బాణాసంచా వెలుగుల్లో భక్తుల జయజయధ్వానాల మధ్య హంసవాహనం ముమ్మార్లు కృష్ణమ్మ ఒడిలో విహరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
 
హంస వాహనమే ఎందుకు?
దుర్గమ్మ త్రిశక్తి స్వరూపిణి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమే కనకదుర్గమ్మ. ఆ ముగురమ్మలలో మూలానక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారానికి దసరా ఉత్సవాల్లో అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆ అమ్మ వాహనమే హంస. అయితే, ముగురమ్మల వాహనాల సమ్మిళితమే హంస వాహనంగా పేర్కొంటారు. అందుకే ఏటా దసరా ఉత్సవాల్లో చివరి రోజున హంసవాహనంపై దుర్గమ్మను జలవిహారానికి తీసుకువెళ్తారు. త్రిలోక సంచారానికి గుర్తుగా కృష్ణమ్మ ఒడిలో మూడుసార్లు హంసవాహనం తిరుగుతుంది. 
 
మూడున్నర దశాబ్దాలుగా..
1980వ సంవత్సరానికి ముందు తెప్పోత్సవం నిర్వహించేవారు కాదు. దసరా ఉత్సవాల్లో విజయదశమి రోజున హంసవాహనంపై నదీవిహారం చేయించడం ద్వారా అమ్మ సంతసిస్తుందని చెప్పడంతో ఈవో ఎం.నరసింహారావు సానుకూలంగా స్పందించారు. అప్పట్లో భద్రాచలం శ్రీరామచంద్రమూర్తికి ఈ ఉత్సవాన్ని నిర్వహించేవారు. అప్పటి నుంచి కొద్ది సంవత్సరాలు భద్రాచలం నుంచి హంసవాహనాన్ని తీసుకొచ్చి తెప్పోత్సవం నిర్వహించేవారు. అయితే, రవాణా తలకుమించిన భారంగా మారింది. దీంతో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానమే హంసవాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. నీటిపారుదల శాఖకు చెందిన పంటుపై హంసవాహనాన్ని ఏర్పాటుచేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 
 
మరిన్ని వార్తలు