ఆధారాలుంటే విచారణకు సిద్ధం

1 Jul, 2015 23:18 IST|Sakshi
ఆధారాలుంటే విచారణకు సిద్ధం

- మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే స్పష్టీకరణ
- ప్రతిపక్షాలది రాజకీయ ప్రేరేపిత కుట్ర.. తిప్పికొడతాను
- ఏం లేకున్నా ఏదో ఒకటి చూపించాలని ప్రయత్నిస్తున్నాయి
- తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా
- ఏసీబీ దర్యాప్తునకు సహకరిస్తా
ముంబై:
ప్రతిపక్షాలు తన పై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని, ఆధారాలు చూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే స్పష్టం చేశారు. రూ.206 కోట్ల ‘కొనుగోళ్ల’ కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు, తాజాగా ఓ డ్యాం నిర్మాణ  కాంట్రాక్టు ఇచ్చే విషయంలో మంత్రి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన పంకజ ముండే ప్రతిపక్షాలు చెబుతున్నవి ‘మాటల కుంభకోణాల’ని, రుజువు చూపించి మాట్లాడాలని సవాలు విసిరారు. గతవారం రోజులుగా లండన్‌లో ఉన్న మంత్రి మంగళవారం ముంబైకి చేరుకున్నారు.

బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షాలు రాజకీయ ప్రేరేపిత కుట్ర చేస్తున్నాయి. నేను వ్యక్తిగత కారణాలతో లండన్ వెళ్లాను. ఆరోపణలకు స్పందించేందుకు భౌతికంగా ఇక్కడ లేను కాబట్టి ప్రతిపక్షాలు ఇలా రాద్ధాతం చేస్తున్నాయి. నిరాధార ఆరోపణలు చేస్తే వాటికి బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఏ కుంభకోణం జరగకున్నా ఏదో ఒకటి జరిగిందని చూపించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి’ అని విమర్శించారు. తప్పు చేసినట్లు రుజువైతే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు.
 
ఫొటో దిగితే ఏదో సాయం చేసినట్లేనా..?

గోపీనాథ్ ముండేకు సన్నిహితుడు, బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి రాష్ట్రీయ సమాజ్ పక్ష్ (ఆర్‌ఎస్‌పీ) నేత రత్నాకర్ గుట్టేకు చెందిన ప్రైవేటు కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టు ఇచ్చారని తాజాగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన పంకజ..‘రత్నాకర్ గుట్టేతో కలసి ఉన్న ఫొటోలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. గత కొన్ని నెలల క్రితమే గుట్టే ఆర్‌ఎస్‌పీలో చేరారు. ఓ కార్యక్రమంలో ఆయనను కలిశాను. ఆ ఫొటోలు అప్పటివే. ఆయనతో కలసి ఫొటో దిగాను అంటే దాని అర్థం.. నేను ఆయనకేదో ఉపకారం చేసినట్లు కాదు. ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి సర్వ హక్కులను జిల్లా కలెక్టర్లకు అప్పగించాం. నేను ఎలాంటి నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదు’ అని వివరించారు. ఈ సందర్భంగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవార్‌తో కలసి గుటే ్ట దిగిన ఫొటోలను ఆమె మీడియా ముందుంచారు. కొత్త కాంట్రాక్టు పద్ధతి తేలేదని, ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలోనే కొనుగోలు చేశామని ఆమె స్పష్టం చేశారు.
 
పార్టీ అండగా ఉంది
విద్యాశాఖ మంత్రి వినోద్  తావడే మినహా మిగతా ఎవరూ ఆమెపై వస్తున్న ఆరోపణలను ఖండించడానికి ప్రయత్నించలేదు. ఇదే విషయాన్ని విలేకరులు పంకజను వివరణ కోరగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనకు అండగా నిలిచారని, మొత్తం పార్టీ అంతా తన వెంట ఉందని ఆమె తెలిపారు. పంకజ విలేకరులతో మాట్లాడుతుండగానే హౌసింగ్ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా వచ్చారు. ‘ఈ విలేకరుల సమావేశానికి ముందే ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ మునగంటివార్, సహకార శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌తో మాట్లాడాను. పని ఉండటంతో వారు రాలేకపోయారు. వారి షెడ్యూల్‌ను చె డ గొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక్కదానినే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను. నాకు పార్టీ, కోట్ల మంది ప్రజల అండ ఉంది’ అని ఆమె చె ప్పారు. తాను, మహిళాశిశు మంత్రిత్వ శాఖ ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధంగా ఉందని, ఏసీబీ తాము సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ఆ శాఖ నుంచి ఏసీబీ కోరిన విషయం తెలిసిందే. సమావేశంలో రాష్ట్రీయ సమాజ్ పక్ష్ నేత మహదేవ్ జన్కార్, పంకజ సోదరి, బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే పాల్గొన్నారు.
 
మీరు చేస్తే కొనుగోళ్లు.. మేం చేస్తే కుంభకోణమా..?
‘రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా కొనుగోళ్లు జరపి రూ.206 కోట్ల కుంభకోణం చేశారని ఎన్సీపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. మరి 2010- 2015 వరకు దాదాపు రూ.408 కోట్ల విలువైన కొనుగోళ్లు రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారానే జరిగాయి. వారు (కాంగ్రెస్, ఎన్సీపీ) చేస్తే కొనుగోళ్లు, అదే మేము చేస్తే కుంభకోణమా’ అని పంకజ ఎద్దేవా చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గకుండా చూసుకోవడం, చిన్నారులకు అవసరమైన మేరకు పౌష్టికాహారం అందించడం కోసమే తన తపన అని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు