రవాణా శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆదాయానికి మించి ఆస్తులు?

18 Nov, 2023 12:44 IST|Sakshi

కర్నూలు: రవాణా శాఖ నంద్యాల కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) సువర్ణ కుమారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కర్నూలు కేంద్రీయ విద్యాలయానికి ఎదురుగా ఉన్న ధనలక్ష్మి నగర్‌లో ఆమె నివాసం ఉంటున్నారు. ఈమె సోదరుడు వరప్రసాద్‌ హైదరాబాద్‌, చెల్లెలు సుభాషిణి కర్నూలులోని రాగమయూరి, మరో సోదరి మార్కాపురంలో నివసిస్తున్నారు.

వీరి ఇళ్లతో పాటు నంద్యాల ఆఫీసు, బనగానపల్లె (ఆర్‌టీఓ ఏజెంట్‌ రాజేంద్ర) ఇంట్లో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి నేతృత్వంలో సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్‌, శ్రీనివాసరెడ్డి, ఇంతియాజ్‌, అపర్ణ, కృష్ణయ్య తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఆమె నివాసముంటున్న ఇంట్లో దాదాపు రూ.10 లక్షల నగదు, 15 బ్యాంకు ఖాతాలు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి.

ధనలక్ష్మి నగర్‌లో జి 1 ఇంటితో పాటు కర్నూలు ఆంధ్రా బ్యాంకులో లాకర్‌, ఆరు ప్రాంతాల్లో విలువైన ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. 2005లో రవాణా శాఖలో ఈమె స్టెనోగా విధుల్లో చేరారు. ఎక్కువ కాలం కర్నూలు డీటీసీ కార్యాలయంలో పనిచేశారు. ఈమెకు ఉన్న ఆస్తులు సక్రమమైనవా, అక్రమంగా సంపాదించారా అనే కోణంలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉన్నట్లు డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు.

మరిన్ని వార్తలు