యువతి అనుమానాస్పద మృతి

15 Oct, 2016 09:47 IST|Sakshi
యువతి అనుమానాస్పద మృతి

గట్టుప్పలలో కాలిన గాయాలతో చనిపోయిన సోని
హత్యా.. ఆత్మహత్యా అని పోలీసుల దర్యాప్తు
సోని మృతిపై అనుమానాలు
తల్లిదండ్రులను విచారిస్తున్న పోలీసులు

చండూరు:
నల్లగొండ జిల్లా గట్టుప్పలలో బొడిగె సోని (19) అనే యువతి కిరోసిన్‌ మంటల గాయాలతో మృతి చెందిన ఘటన వివాదాస్పదమవుతోంది. ఇప్పటివరకు చండూరు మండలంలో ఉన్న గట్టుప్పలను మండల కేంద్రం చేయాలని స్థానికులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అదే డిమాండ్‌తో సోని ఆత్మహత్య చేసుకుందని తొలుత ప్రచారం జరిగినా.. ఆ తర్వాత పలు అనుమానాలకు దారితీసింది. అనుమానంతో తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే.. సోని మృతి అనంతరం డీఐజీ అకున్‌ సబర్వాల్‌ గ్రామానికి రావడం, సోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లిన నల్లగొండ జిల్లా ఆసుపత్రికి జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు వచ్చి పరిశీలించడం, పోలీసులను మోహరించి, బాష్పవాయు గోళాల వాహనాలతో పోలీసులు బందోబస్తు పెట్టడం గమనార్హం.

ఇదీ జరిగింది..
గట్టుప్పల గ్రామానికి చెందిన బొడిగె క్రిష్ణయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.  పెద్ద కుమార్తెకు పెళ్లి కాగా, ఇద్దరు కుమార్తెలు ఇంటి దగ్గరే  ఉంటున్నారు. చిన్న కుమార్తె సోని(19) మానసిక వికలాంగురాలు. ఆమె శుక్రవారం సాయంత్రం ఇంట్లో కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుందన్న వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించింది. ఆ సమయంలో సోని తల్లితండ్రులతో తోబుట్టువు స్వాతి.. గట్టుప్పలను మండల కేంద్రంగా చేయాలనే ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ తర్వాత సోని తల్లి, కూతురు ఇంటికి చేరుకోగా బాత్‌రూంలో కాలిన గాయాలతో సోని కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటుచేసి 108లో ఆమెను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే గ్రామంలో 144వ సెక్షన్‌ విధించారు.

పోలీసుల రంగప్రవేశంతో..
పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత కేసు కొత్త మలుపు తిరిగింది. సోని తలకు, వీపు మీద గాయాలుండడం, ఆమె పూర్తిగా కూడా కాలి లేకపోవడంతో హత్యచేసిన తర్వాతే కిరోసిన్‌ పోసి తగులబెట్టారని పోలీసులు అనుమానించారు. సోని చనిపోయిన ప్రదేశంలో కూడా ఆమె ఫోన్‌ ఉండడం, కిరోసిన్‌ పోసుకుని తగులబెట్టుకున్న ఆనవాళ్లు కనిపించకపోవడం, ఇంట్లోని మంచం వద్ద రక్తపు మరకలు కనిపించడం, బాత్‌రూం పక్కనే ఉన్న ఐదు లీటర్ల కిరోసిన్‌ డబ్బా, అక్కడే అగ్గిపెట్టె ఉండటం లాంటి అంశాలను పోలీసులు గుర్తించారు. ఈ కోణంలోనే సోని తల్లిదండ్రులిద్దరినీ అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోని తల్లిదండ్రులను విచారణ చేస్తున్నామని, హత్యా, ఆత్మహత్యా అనేది తేలలేదని, శవపరీక్ష ద్వారానే తెలుస్తుందని చండూరు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి చెప్పారు. సోని మృతదేహానికి నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాలేదు. నల్లగొండ ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు.  

తలకు గాయాల వల్లే మృతి: ఎస్పీ
సోని తలకు గాయం కావడం వల్లే మృతి చెందినట్లు ఎస్పీ ఎన్‌. ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోని మృతి చెందిన తర్వాతే ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు