సీఐ హత్య కేసులో ప్రియురాలికి యావజ్జీవం

25 Mar, 2016 15:48 IST|Sakshi
సీఐ హత్య కేసులో ప్రియురాలికి యావజ్జీవం

కేకే.నగర్ : సబ్ ఇన్‌స్పెక్టర్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన ప్రియురాలికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ చిదంబరం కోర్టు తీర్పు ఇచ్చింది. విళ్లుపురం జిల్లా ఉళుందూరు పేటకు చెందిన పావాడై కుమారుడు గణేశన్ (32). ఇతడు 2011వ సంవత్సరం  కడలూరు జిల్లా చిదంబరం సమీపంలో బ్రాంచ్ పోలీసుస్టేషన్‌లో సీఐ. అదే పోలీసుస్టేషన్ కు అంబలత్తాడి కుప్పం గ్రామానికి చెందిన కలైమణి అను, అతని భార్య వనిత (25) ఒక కేసు విషయమై తరచూ వచ్చి వెళ్లేది. ఆ సమయంలో గణేశన్‌కు, వనితకు మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వనిత తన భర్త కలైమణికి విడాకులు ఇచ్చి గణేశన్‌ను వివాహం చేసుకోవడానికి నిర్ణయించింది.

అయితే గణేశన్ కొన్ని కారణాల వలన వనితతో వివాహానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో గణేశన్‌కు అతని తల్లిదండ్రులు కుదిర్చిన మరో యువతితో 2014లో వివాహం జరిగింది. ఈ విషయం తెలిసి వనిత తనను కూడా పెళ్లి చేసుకోవాలని కోరుతూ గణేశన్‌పై వత్తిడి తెచ్చింది. అతను అంగీకరించకపోవడంతో  2014 జూలై 21వ తేదీ అన్నామలైనగర్‌లో ఉన్న గణేశన్ ఇంటికి వెళ్లిన వనిత అతన్ని కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ కేసుపై విచారణ చిదంబరం జిల్లా అదనపు బెంచ్ న్యాయస్థానంలో జరిగింది. విచారణ జరిపిన న్యాయమూర్తి కింగ్‌స్లీ క్రిస్టోఫర్ బుధవారం తీర్పులో వనితకు యావజ్జీవ కారాగారశిక్ష రూ.1000 జరిమానా విధించారు. అనంతరం వనితను పోలీసు వ్యాన్‌లో వేలూరు జైలుకు తరలించారు.

>
మరిన్ని వార్తలు