ఏటయిందే గోదారమ్మా..!

4 Dec, 2016 08:49 IST|Sakshi
ఏటయిందే గోదారమ్మా..!

డిసెంబర్‌ మొదట్లోనే కనిష్ట స్థాయికి పడిపోయిన ప్రవాహం
గోదావరి డెల్టాలో రబీ పంటల సాగుపై రైతుల్లో ఆందోళన
కనీసం 90 టీఎంసీలు అవసరమంటోన్న జలవనరుల శాఖ
సీలేరు రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్నది 30 టీఎంసీలే


సాక్షి, అమరావతి: ఈ ఏడాది రబీ ప్రారంభంలోనే గోదావరి నదిలో ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోవడం డెల్టా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పంటల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. డెల్టాలో రబీలో పంటల సాగుకు కనిష్టంగా 90 టీఎంసీలు అవసరం. సీలేరు నదిపై నిర్మించిన రిజర్వాయర్లలో 30 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోదావరిలో సహజ సిద్ధంగా ఉండే ప్రవాహాల నుంచి 60 టీఎంసీలు వస్తే డెల్టాలో రబీ పంటలు చేతికందుతాయి. కానీ.. డిసెంబర్‌ ప్రారంభంలోనే గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో.. డ్రైయిన్‌ల నుంచి నీటిని ఎత్తిపోసినా 60 టీఎంసీల నీటి లభ్యత అసాధ్యమని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఇది పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఉభయగోదావరి జిల్లాల్లో 10,13,161 ఎకరాల్లో ఖరీఫ్‌లోనూ, రబీలోనూ పంటలు సాగు చేస్తారు. పంటల సాగుకు కనిష్టంగా ఖరీఫ్‌లో 102, రబీలో 90 టీఎంసీలు అవసరం. డెల్టాలో ఖరీఫ్‌ పంటల కోతలు పూర్తయివడంతో రబీ పంటలకు నారుమళ్లు పోసుకుని.. పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీకి 5,633 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. ఐదు వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, 633 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఇదే సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 5,600 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు మళ్లించారు. వీటిని కలుపుకున్నా గోదావరిలో ప్రవాహం 11,233 క్యూసెక్కులేనని స్పష్టమవుతోంది.

ఆందోళనలో రైతన్నలు..
గోదావరి డెల్టాలో రబీలో డిసెంబర్‌ 15 నుంచి వరి నాట్లు వేస్తారు. ఏప్రిల్‌ నెలాఖరుకు పంట నూర్పిళ్లను ప్రారంభిస్తారు. డిసెంబర్‌ 15 నాటికి పట్టిసీమ పంపులను నిలిపేస్తామని సర్కార్‌ చెబుతోంది. వరి నాట్ల సమయంలో డెల్టాకు కనిష్టంగా 13 వేల క్యూసెక్కులు అవసరం. పంట పొట్ట దశలో ఉన్నప్పుడూ ఇదే స్థాయిలో అవసరం. డిసెంబర్‌ ప్రారంభంలోనే 11 వేల క్యూసెక్కులకు నీటి ప్రవాహం పడిపోయిన నేపథ్యంలో.. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కనీసం 2,500 నుంచి మూడు వేల క్యూసెక్కులు కూడా వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. సీలేరు నదిపై నిర్మించిన రిజర్వాయర్లలో 30 టీఎంసీలు మాత్రమే డెల్టాకు విడుదల చేసే అవకాశం ఉంది. సీలేరు రిజర్వాయర్ల నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినా.. గోదావరి సహజ ప్రవాహాలతో కలిపి 7,500 క్యూసెక్కులకు మించి డెల్టాకు విడుదల చేసే అవకాశం ఉండదు. ఇది రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రత్యామ్నాయ చర్యలేవీ?
గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన నేపథ్యంలో కాలువల పరిస్థితి దయనీయంగా ఉంది. ఖరీఫ్‌లో ఆయకట్టు భూములకు నీళ్లందక ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రబీలో సమర్థంగా డెల్టా కు నీళ్లందించడానికి ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చ ర్యలూ తీసుకోలేదు. రైతులకు అవగాహన కల్పించే రీతిలో సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదు. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ చివరి నిముషంలో డ్రెయిన్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి హడావుడి చేసినా పంటలను రక్షించే అవకాశం ఉండదు. రైతులు వేలాది కోట్ల రూపాయలను పెట్టుబడుల రూపంలో కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా రైతులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు