మరో బెంచ్‌కు జులుం

10 Dec, 2015 02:15 IST|Sakshi

కోర్టులో పిటిషన్‌తో సర్కారు అలర్ట్
  నెహ్రూ స్టేడియానికి చేర్చండి
  స్వచ్ఛంద సంస్థలు, సంఘాలకు వినతి
 
 సాక్షి, చెన్నై : స్వచ్ఛంద సంస్థలు, సంఘాల మీద సాగిన జులుం వ్యవహారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ నేతృత్వంలోని  బెంచ్‌కు మారింది. ఆయా సంఘాలు, సంస్థలకు సహకారం అందించే రీతిలో ప్రభుత్వం చర్యల్లో  పడింది. సహాయకాలను నెహ్రూ ఇండోర్ స్టేడియానికి తరలించాలని, అధికారుల సమన్వయంతో పంపిణీ చేయాలని సూచించే పనిలో పడింది. చెన్నైలో వరద బాధితులకు సాయం అందిస్తున్న సంఘాలు, స్వచ్ఛంద సంస్థలపై ఒత్తిళ్లు , నిర్బంధం పర్వం సాగిన విషయం తెలిసిందే. అధికార పక్షం సేనల జులుం చివరకు హైకోర్టుకు చేరింది. స్వచ్ఛంద సంస్థలు, సంఘాలకు భద్రత కల్పించాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ నేతృత్వంలో  సహాయకాల పంపిణీ సాగే రీతిలో చర్యలు తీసుకోవాలని సింగిల్ బెంచ్ ముందు దాఖలైన పిటిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తీవ్రంగానే పరిగణించారు.
 
  మానవతా హృదయంతో ముందుకు వస్తున్న వాళ్ల మీద సాగుతున్న దాడుల్ని పరిగణలోకి తీసుకున్న సంజయ్ కిషన్ కౌల్ పిటిషన్ విచారణను తన నేతృత్వంలోని తొలి బెంచ్ ద్వారా సాగించేందుకు నిర్ణయించినట్టు ఉన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ప్రభుత్వానికి తీవ్ర అక్షింతలు వేసి ఉన్న ఆయన, తాజా పిటిషన్ విచారణలో ప్రభుత్వం, అధికార వర్గాల మీద తీవ్రంగానే స్పందించే అవకాశాలు ఎక్కువే. ఈ పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం పిటిషన్ విచారణకు రాబోతోంది.
 
  ఈ సమయంలో పిటిషన్ సింగిల్ బెంచ్ నుంచి ప్రధాన బెంచ్‌కు మారడంతో అధికార వర్గాలు ఇరకాటంలో పడే అవకాశాలు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు, సంఘాలకు బాసటగా నిలిచే విధంగా ఆగమేఘాలపై ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సహాయకాలను నేరుగా కాకుండా నెహ్రూ ఇండోర్ స్టేడియానికి తరలించాలని, అక్కడున్న అధికారులకు అప్పగించాలని సూచించారు. అప్పగించిన వస్తువుల వివరాలను అక్కడి అధికారుల వద్ద నమోదు చేయించాలని, అక్కడి నుంచి ఆయా వస్తువులు బాధితులకు కార్పొరేషన్ ద్వారా అందించడం జరుగుతుందని సూచించడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు