సీజేపై ఫిర్యాదు

11 May, 2015 02:38 IST|Sakshi

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్‌పై, న్యాయమూర్తి కర్ణన్ గిరిజన, వెనుకబడిన వర్గాల కమిషన్‌కు ఫిర్యాదు చేసి చర్చకెక్కారు. హైకోర్టులో ఈ చర్చ ఊపందుకోవడంతో కలకలం రేగింది.
 
 సాక్షి, చెన్నై : హైకోర్టు పరిధిలోని ఇతర కోర్డులో న్యాయమూర్తుల నియామకం సంబంధించి ఓ కమిటీని గత నెల ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ ప్రకటించారు. న్యాయమూర్తులు ధనపాలన్, సుధాకర్, హరి పరంధామన్, కృపాకరణ్, రమలకు ఆ కమిటీలో చోటు దక్కింది. ఈ కమిటీకి వ్యతిరేకంగా న్యాయమూర్తి కర్ణన్  గలం విప్పడం చర్చకు దారి తీసింది. ఈ కమిటీలోని ధనపాలన్ నియామకంపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. అలాగే, సుధాకర్, హరి పరంధామన్ బంధువులు అని, ఆ ఇద్దర్నీ ఒకే కమిటీలో ఎలా నియమిస్తారన్న ప్రశ్నను లేవదీయడంతో పాటుగా ఆ కమిటీ నియామకాన్ని రద్దు చేశారు.
 
  మరుసటి రోజే కర్ణన్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ, న్యాయమూర్తులు తమిళ్ వానన్, సెల్వన్ నేతృత్వంలోని బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఉన్నది. ఈ పరిస్థితుల్లో తనను సీజే సంజయ్ కిషన్ కౌల్ కించ పరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని     ఆరోపిస్తూ గిరిజన, వెనుకబడిన వర్గాల కమిషన్‌కు కర్ణన్ ఫిర్యాదు చేయడం హైకోర్టులో చర్చకు దారి తీసింది. తాను దళితుడ్ని కాబట్టి సీజే తనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసి ఉన్నట్టుగా హైకోర్టులో చర్చ సాగుతుండటంతో ఈ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నదోనన్న ఉత్కంఠ బయలుదేరి ఉన్నది.
 

మరిన్ని వార్తలు